- బిల్డర్, కొనుగోలుదారు మధ్య ఒప్పందం ఏకపక్షంగా ఉండకూడదు
- సుప్రీంకోర్టు స్పష్టీకరణ
ప్రాపర్టీ కొనుగోలుకు సంబంధించి బిల్డర్, కొనుగోలుదారు మధ్య జరిగే ఒప్పందంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఒప్పందం బిల్డర్ కు అనుకూలంగా ఏకపక్షంగా ఉండకూడదని స్పష్టంచేసింది. ఒకవేళ కొనుగోలుదారు తన కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ప్రాథమిక అమ్మకపు ధర (బీఎస్పీ)లో 10 శాతానికి మించి బిల్డర్ వసూలు చేయడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఎస్ వీ ఎన్ భట్ లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. గుర్గావ్ లోని సెక్టార్ 104లో గోద్రేజ్ సమ్మిట్ ప్రాజెక్టులో ఓ కొనుగోలుదారు ఫ్లాట్ బుక్ చేసుకుని, దానికి సంబంధించిన మొత్తం చెల్లించారు.
అయితే ఫ్లాట్ అప్పగించే సమయంలో తనకు ఫ్లాట్ వద్దని.. తన డబ్బు వెనక్కి ఇవ్వాలని కోరారు. దీంతో గోద్రేజ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 20 శాతం మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన డబ్బు ఇస్తామని పేర్కొంది. దీనిపై కొనుగోలుదారు జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్ సీఆర్ డీసీ)ని ఆశ్రయించారు. వాదనలు విన్న కమిషన్.. ప్రాథమిక అమ్మకపు ధరలో 10 శాతం మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని కొనుగోలుదారుకు చెల్లించాలని ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ గోద్రేజ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొనుగోలును రద్దు చేసుకుంటే 20 శాతం మొత్తాన్ని మినహాయించుకుంటామనే నిబంధన అమ్మకపు ఒప్పందంలో ఉందని.. అందువల్ల తమ నిర్ణయం సబబేనని వాదించింది.
దీనిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఒప్పందం అనేది ఏకపక్షంగా ఉండకూడదని.. ప్రస్తుతం ఒప్పందం నిబంధనలకు విరుద్ధంగా, అనైతికంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టుకు సంబంధించిన గత తీర్పులు ప్రస్తావిస్తూ.. అమ్మకపు ధరలో 10 శాతం మొత్తం మినహాయించుకోవడమే సబబు అని.. అంతకు మించి మినహాయించుకోవడానికి వీలు లేదని పేర్కొంటూ ఎన్ సీ ఆర్ డీసీ తీర్పును సమర్థించింది.