కొన్నేళ్ల నుంచి దున్నుతున్న భూమి.. కుటుంబానికి అదే ఆధారం.. భార్యభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు సైతం సాయంత్రం వేళలో వ్యవసాయ భూముల్లో పని చేస్తారు. కానీ, ఏం లాభం? ధరణి తెచ్చిన తంటాల వల్ల ఆ భూమిపై ఆ కుటుంబం హక్కు కోల్పోయింది. ఆ భూమిపై గత యజమానికి హక్కు లభించింది. పాస్ పుస్తకమూ మంజూరైంది. దీంతో, వ్యవసాయ భూమి తనదేనంటూ అతను కంచే వేశాడు. ఆయా కుటుంబాన్ని భూమిలోకి రాకుండా నియంత్రించాడు. ఏం చేయాలో అర్థం కాక కనిపించిన ప్రతి అధికారిని కలిశారు. తొక్కని ఆఫీసు గడప అంటూ లేదు. ఇక ఎక్కడ న్యాయం జరగట్లేదని భావించి.. భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.
ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం వల్ల కొన్నిసార్లు కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పడానికి నిదర్శనమిదే. ఇలాంటి ఉదంతాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ధరణి తెచ్చిన తిప్పల వల్ల రైతన్నలకు నిద్ర కరువైంది. స్థల యజమానులకు మనశ్శాంతి దూరమైంది. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ధరణిలో అతి త్వరలో డిలీట్ (రివోక్) ఆప్షన్ ను ప్రవేశపెడుతుందని సమాచారం. ఈ మేరకు దీనిపై లోతుగా అధ్యయనం చేస్తున్నారని తెలిసింది. దీని వల్ల ధరణిలో తప్పుగా నమోదైన భూముల్ని సరిచేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇది వాస్తవంలోకి వస్తే.. ధరణిలో నెలకొన్న కొన్ని సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి. మరి, ప్రభుత్వం ఈ అంశంపై అధికారిక ప్రకటన ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.