Categories: LATEST UPDATES

ఈవీ చార్జింగ్ స్టేషన్ ఇళ్లకు డిమాండ్

  • 2 నుంచి 5 శాతం ధరలు పెరిగే అవకాశం: జేఎల్ఎల్

ప్రస్తుతం పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో జనం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. తయారీదారులు సైతం బ్యాటరీ వాహనాలను భారీగా, మరింత మెరుగైన సౌకర్యాలతో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రికల్ వాహనాల (ఈవీ) చార్జింగ్ స్టేషన్ల అవసరం క్రమంగా పెరుగుతోంది. కొత్తగా మొదలుపెడుతున్న నిర్మాణ ప్రాజెక్టుల్లో చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు తప్పనిసరి అయింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాలున్న అపార్ట్ మెంట్లు, ఇళ్ల ధరలు 2 నుంచి 5 శాతం పెరిగే అవకాశం ఉందని జేఎల్ ఎల్ పేర్కొంది.

2030 నాటికి ఎలక్ట్రికల్ వాహనాల పెరుగుదల 40 శాతానికి పైగా ఉంటుందని వెల్లడించింది. ఈ కారణంగా ఈవీ స్టేషన్లు ఉన్న ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందని, ఫలితంగా వాటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న భవంతుల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ 2026 నుంచి మరింత ఊపందుకుంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఇంటి యజమానులు సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలిపింది. అలాగే పెద్దపెద్ద కమ్యూనిటీల్లో ఆయా అసోసియేషన్లు ఈ పనికి శ్రీకారం చుడుతున్నాయి. తమ తమ కమ్యూనిటీల్లో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి, వినియోగదారుల నుంచి నిర్దారిత మొత్తం వసూలు చేస్తున్నాయి. అలాగే కొత్తగా నిర్మాణం చేస్తున్న భవనాల్లో కనీసం 5 శాతం పార్కింగ్ లాట్లను ఈవీ స్టేషన్ల కోసం రిజర్వు చేస్తున్నారు. ఆఫీసులు, మార్కెట్లలో కూడా ఈ సౌకర్యం ఏర్పాటు దిశగా పలువురు యోచిస్తన్నట్టు జేఎల్ఎల్ తెలిపింది.

ఢిల్లీ ముందుచూపు..

ఈవీ స్టేషన్ల ఏర్పాటులో ఢిల్లీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోంది. ఈ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల ప్ర్రక్రియను సలుభతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఎలాంటి అవాంతరాలూ ఉండకుండా చేసేందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాణిజ్య, సంస్థాగత, నివాస ప్రాంతాల్లో ప్రైవేటు ఈవీ స్టేషన్లు అత్యంత సులభంగా ఏర్పాటు చేసే ఉద్దేశంతో సింగిల్ విండో పద్ధతి తీసుకొచ్చింది. ఆన్ లైన్, ఫోన్ కాల్స్ ద్వారా దీని అనుమతి పొందే వీలు కల్పించారు. తెలంగాణ సహా దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ పద్ధతి తీసుకొస్తే బాగుంటుందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

This website uses cookies.