ఇల్లు లేదా ఫ్లాట్ ను పూర్తిగా నిర్మించకుండా కొనుగోలుదారులకు అప్పగించడానికి వీల్లేదని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ స్పష్టం చేసింది. స్థానిక అధికారుల నుంచి కంప్లీషన్ సర్టిఫికెట్ తీసుకోకుండా కొనుగోలుదారులకు బలవంతంగా ఆ ఇంటిని అప్పగించడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోద యోగ్యం కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో విల్లా కోసం ఫిర్యాదుదారు చెల్లించిన రూ.3.5 కోట్ల మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని బెంగళూరుకు చెందిన కంపెనీని ఆదేశించింది.
మంత్రి టెక్నాలజీ కన్సల్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2013లో చెన్నైలో లగ్జరీ విల్లా ప్రాజెక్టు చేపట్టింది. 2015 మే నాటికి విల్లాలను అప్పగిస్తామని పేర్కొంది. దీంతో సుమన్ కుమార్ ఝా, ప్రతిభా ఝా లు 3900 చదరపు అడుగుల విల్లా కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుని ఆ మేరకు చెల్లింపు చేశారు. అయితే, గడువులోగా నిర్మాణం పూర్తికాలేదు. అయినప్పటికీ విల్లాను పూర్తిగా నిర్మించి అప్పగిస్తున్న పేర్కొన్న పేపర్లపై సంతకాలు చేయాలని కంపెనీ కోరింది. సంతకం చేస్తేనే ఫ్లాట్ తాళాలు అప్పగిస్తామని పేర్కొంది. పైగా స్థానిక అధికారుల నుంచి ప్రాజెక్టు పూర్తిచేసినట్టుగా ఎలాంటి సర్టిఫికెట్ రాలేదు.
దీంతో కొనుగోలుదారులు కమిషన్ ను ఆశ్రయించారు. ఆ ప్రాజెక్టు రెండేళ్లకు పైగా జాప్యం జరిగిందని.. పైగా నేటికీ అసంపూర్తి నిర్మాణాలే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలనూ పరిశీలించిన కమిషన్.. కంపెనీ వైఖరిని తప్పుబట్టింది. వెంటనే ఫిర్యాదుదారులకు వారు చెల్లించిన రూ.3.5 కోట్ల మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది.
This website uses cookies.