హైదరాబాద్ లో కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఇటీవల కాలంలో రెడీ టూ మూవ్ ఇన్ ప్రాపర్టీలకు 84 శాతం డిమాండ్ పెరిగింది. ఈ మేరకు నో బ్రోకర్ డాట్‌కామ్ ఒక నివేదికను వెల్లడించింది. ముఖ్యంగా పెట్టుబడిదారులు అధిక అద్దె ఆదాయం కోసం చూస్తుండటంతో రెడీ టూ మూవ్ ఇన్ ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగినట్టు పేర్కొంది. దేశీయంగా రియల్ ఎస్టేట్ రంగం పురోగతిలో ఉండటం.. ఇతర రంగాల కంటే ఇందులోనే చక్కని రాబడులు ఉండటంతో అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, ఎన్నారైల మొగ్గు రియల్ రంగం వైపే ఉంది. దీంతో లగ్జరీ ప్రాపర్టీలతోపాటు అధిక అద్దె ఆదాయాన్ని ఇచ్చే రెడీ టూ మూవ్ ఇన్ ప్రాపర్టీలను ఎంచుకుంటున్నారు. పెరుగుతున్న అద్దెల రూపంలో ఆదాయం పొందడం కోసం తాము వీటిని ఎంచుకుంటున్నట్టు 33 శాతం మంది చెప్పగా.. మరో 33 శాతం మంది అందుబాటు ధరలో ఉన్న ఇళ్లను ఎంచుకుంటున్నట్టు వివరించారు. నగరంలో ఆస్తి కలిగి ఉండటం ఆర్థిక భధ్రత ఇస్తుందనే ఉద్దేశంలో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నట్టు 29 శాతం మంది వివరించారు.
ఇక 86 శాతం మంది నగర పరిధిలో ఇళ్లను కొనుగోలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. 14 శాతం మంది శివారు ప్రాంతాలకు ఓటేశారు. ఇక మొదటిసారి ప్రాపర్టీ కొనుగోలుచేసినవారి విషయానికి వస్తే.. 87 శాతం మంది వ్యక్తిగత వినియోగం కోసం, 13 శాతం మంది పెట్టుబడుల పెట్టడం కోసం ఇళ్లను కొన్నట్టు వెల్లడైంది. హైదరాబాద్ లో దాదాపు 68 శాతం మంది రూ.60 లక్షల లోపు 2 బీహెచ్ కే ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరిచారు. 89 శాతం మంది వాస్తు అనుకూలంగా ఉన్న ఇళ్లనే పరిగణనలోకి తీసుకున్నారు. అద్దెలు, ప్రాపర్టీ ధరల పెరుగదల వల్లే 2023లో రియల్ రంగం వృద్ధి కనబరిచిందని నో బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ గార్గ్ పేర్కొన్నారు. చాలా మంది ఏ గ్రేడ్ బిల్డర్లు గతేడాది అమ్మకాల కంటే ఈ ఏడాది 50 శాతం వృద్ధి సాధించారని వెల్లడించారు. అలాగే ప్రస్తుత డిమాండ్ ను అధిగమించడానికి వీలుగా కొత్త లాంచ్ లు వస్తున్నట్టు చెప్పారు. ధరలు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారులు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు.