Categories: LATEST UPDATES

నోయిడా జంట టవర్ల కూల్చివేతకు అంతా సిద్ధం

గ్రేటర్ నోయిడాలో సూపర్ టెక్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జంట టవర్ల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. దాదాపు 3700 కిలోలకు పైగా పేలుడు పదార్థాల అమరిక పూర్తయింది. మొత్తం 40 మంది బ్లాస్టర్లు, శిక్షణ పొందిన సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. తొలుత సియాన్ టవర్ లో పలు ప్రదేశాల్లో రంధ్రాలు చేసి పేలుడు పదార్థాలు అమర్చారు. అనంతరం అపెక్స్ లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రస్తుతం ట్రంకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా పేలుడు పదార్థాలన్నింటినీ ఒకదానికొకటి కలుపుతారు. ఇలా మొత్తం దాదాపు 20వేలకు పైగా కనెక్షన్లు చేయాల్సి ఉంటుంది. అనంతరం అన్ని కనెక్షన్లూ సక్రమంగా ఉన్నాయో లేదో సరిచూస్తారు.

అంతా సిద్ధమయ్యాక ఆగస్టు 28న ఈ కనెక్షన్లంటినీ ప్రధాన డిటోనేటర్ తో అనుసంధానం చేస్తారు. ఆపై మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేత ప్రారంభిస్తారు. ప్రస్తుతం 40 మంది పనిచేస్తుండగా.. కూల్చివేత రోజున 10 మంది మాత్రమే ఉంటారని అధికారులు తెలిపారు. ఈ కూల్చివేతను ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ పర్యవేక్షిస్తోంది. దాదాపు వంద మీటర్ల పొడవైన ఈ టవర్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందున కూల్చివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

This website uses cookies.