- ప్రారంభ మొత్తం చెల్లించిన వారు సగం మందే
రాజీవ్ స్వగృహ అమ్మకాల సమయంలో ఊహించని విధంగా వెల్లువెత్తిన స్పందన.. తగ్గుముఖం పట్టింది. ప్లాట్లు పొందినవారిలో ఇప్పటివరకు కేవలం సగం మంది మాత్రమే నిర్దేశిత మొత్తం చెల్లించారు. అది కూడా పెంచిన గడువు ముగిసిన తర్వాత పరిస్థితి. బండ్లగూడ, పోచారంలో మొత్తం 3900 ఫ్లాట్లను హెచ్ఎండీఏ విక్రయించింది. వీటికి అనూహ్య స్పందన లభించి, ఏకంగా 39 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ప్రారంభ మొత్తం చెల్లించడంలో మాత్రం చాలామంది అనాసక్తి ప్రదర్శించారు. ఇప్పటివరకు కేవలం 1900 మంది మాత్రమే నిర్దేశిత మొత్తాన్ని చెల్లించారు.
నిబంధనల ప్రకారం ప్లాట్లు పొందినవారు ప్రారంభ మొత్తంగా కొంత చెల్లించాల్సి ఉంది. 3 బీహెచ్ కే ఫ్లాట్ కు రూ.3 లక్షలు, 2 బీహెచ్ కేకు రూ.2 లక్షలు, 1 బీహెచ్ కేకు రూ.లక్ష కేటాయింపు లెటర్ ఇచ్చిన వారం రోజుల్లోగా చెల్లించాలి. అయితే, కేటాయింపు లెటర్లు ఇచ్చి నెల గడిచిపోయినా 1900 మంది మాత్రమే ఆ సొమ్ము చెల్లించారు. ప్రారంభ మొత్తం చెల్లించినవారు 90 రోజుల్లో మిగిలిన మొత్తం చెల్లించి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒకే కుటుంబానికి చెందిన పలువురు వ్యక్తులు వేర్వేరుగా దరఖాస్తు చేశారని, అలాంటి వారు ఒక ఫ్లాట్ కి మాత్రమే డబ్బులు కడుతున్నారని, అందుకే 50 శాతం ఫ్లాట్లు మిగిలిపోయాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే పలువురికి బ్యాంకు లోన్లు రాని కారణంగా డబ్బులు కట్టలేకపోయారని అంటున్నారు