Categories: TOP STORIES

పండగ సీజన్ లో అమ్మకాలు పెరిగేనా?

కోవిడ్ మూడు వేవ్ లతోపాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆర్బీఐ వడ్డీ రేట్ల సవరణ వంటి అంశాలు హౌసింగ్ డిమాండ్ పై ప్రభావం చూపించాయి. అధిక ఇన్ పుట్ ఖర్చుల వల్ల జూన్ త్రైమాసికంలో ధరలు సగటును 5 శాతం పెరిగినప్పటికీ, సిమెంట్, ఉక్కు అమ్మకాలు 15 శాతం పడిపోయాయి. అయితే, ఇది కేవలం స్వల్పకాలమేనని, పండుగ సీజన్ నుంచి పుంజుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 99,550 ఇళ్ల అమ్మకాలు జరగ్గా.. రెండో త్రైమాసికంలో 84,930 యూనిట్లకు తగ్గిపోయింది. రెండో త్రైమాసికంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ అత్యధికంగా 25,785 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. అయితే, తొలి త్రైమాసికంలో ఈ సంఖ్య 29,130గా ఉండటం గమనార్హం. ఇక ముంబై తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్ 15,340 ఇళ్ల విక్రయాలతో రెండో స్థానంలో ఉంది. ఇది తొలి త్రైమాసికం (18,835) కంటే 19 శాతం తక్కువ. బెంగళూరు 11,505 యూనిట్ల విక్రయంతో మూడో ప్లేసులో ఉంది. తొలి త్రైమాసికంలో ఇది 13,378 కావడం గమనార్హం. మొత్తంగా ఏడు నగరాల అమ్మకాలను పరిశీలిస్తే ఇన్వెంటరీ 4 నాలుగు క్షీణించింది.

రెపో రేటు తాత్కాలిక ప్రభావం..
జూన్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలపై రెపో రేటు పెంపు తాత్కాలిక ప్రభావం చూపించిందని అన్ రాక్ చైర్మన్ అనుజ్ పూరి తెలిపారు. స్టాక్ మార్కెట్ వంటి అస్థిర ఆస్తులకు వ్యతిరేకంగా రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యత రంగంగా ఉద్భవించిందని పేర్కొన్నారు. పండగ సీజన్లో రియల్ ఎస్టేట్ లో అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లు, రాయితీలు లభిస్తాయని, ఫలితంగా ఏడు నగరాల్లో అమ్మకాలు కనీసం 20 శాతం పెరుగుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. మరోవైపు ఈ ఏడాది క్యూ2లో అమ్ముడుపోని ఇన్వెంటరీ కాస్త తగ్గినప్పటికీ.. ఢిల్లీ-ఎన్ సీఆర్, ముంబై, కోల్ కతా, పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు 5 శాతం పెరిగాయని క్రెడాయ్, కొలీర్స్ ఇండియా, లయాసెస్ ఫోరస్ సంస్థల అధ్యయనంలో తేలింది. అత్యధికంగా ఢిల్లీలో 10 శాతం, అహ్మాదాబాద్ లో 9, హైదరాబాద్ లో 8 శాతం చొప్పున రెసిడెన్షియల్ ధరలు పెరిగాయి. ఇక టైర్-2 నగరాలకు సంబంధించి రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ వృద్ధిలో అహ్మదాబాద్, వడోదర, నాసిక్, గాంధీనగర్, జైపూర్ లు మొదటి ఐదు స్థానాలు ఆక్రమించాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా కాలం తర్వాత తిరోగమనం నుంచి పురోగమిస్తోందని.. చాలామంది గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని ప్రాప్ ఈక్విటీ ఫౌండర్, ఎండీ సమీర్ జసుజా పేర్కొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా గరిష్టంగా రూ.కోటి ధర కలిగిన ఇళ్లకు అత్యధిక డిమాండ్ ఉన్నట్టు నివేదికలు వెల్లడించాయి.

This website uses cookies.