FIRE EVACUATION LIFTS
హైదరాబాద్ మహానగరంలో బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాల్ని నిర్మించేవారి సంఖ్య పెరిగింది. అదేవిధంగా, అందులో సొంతిల్లు కొనుక్కోవడం సరికొత్త పోకడగా మారింది. నిర్మాణ సంస్థలు పోటీపడి ఆకాశాన్ని తాకేలా వీటిని నిర్మిస్తున్నాయి. కాకపోతే, అగ్ని ప్రమాదాలు వంటివి జరిగితే అందులో నుంచి సురక్షితంగా ఎలా బయటపడొచ్చు? మరి, వాటిలో ఫైర్ లిఫ్టులు వంటివి ఏర్పాటు చేసే అవకాశముందా? అలాంటి నిబంధనను విధించేందుకు ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయా?
దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఆకాశహార్మ్యాల నిర్మాణాలు పెరుగుతున్నాయి. కనీసం 20 అంతస్తుల నుంచి మొదలుకొని గరిష్టంగా 50 అంతస్తులు ఆ పైవరకు ఎత్తైన భవనాలను నిర్మిస్తున్నారు. అందులో ఎక్కువగా 25 నుంచి 45 అంతస్తుల వరకూ కడుతున్నారు. టెక్నాలజీ పెరగడంతో క్షణాల్లో పైఅంతస్తులకు చేరుకునేందుకు ఆధునిక లిఫ్టులను ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే, అగ్నిప్రమాదం వంటివి జరిగితే.. అందులో నుంచి క్షేమంగా బయటపడే మార్గాలేమైనా ఉన్నాయా? అందుకు ఎలాంటి ఏర్పాట్లను బిల్డర్లను చేయాలి?
దేశంలోని చాలా మెట్రో నగరాల్లోని ఎత్తైన భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చాలా వరకు ప్రాణ నష్టం జరుగుతోంది. ఈమధ్య హైదరాబాద్లో జరిగిన పలు అగ్ని ప్రమాదాలాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. మరీ ముఖ్యంగా పాత బస్తీ గుల్జార్ హౌజ్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌లో ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే భారీ భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పై అంతస్తుల్లో ఉన్న వారిని వేగంగా కిందికి తీసుకొచ్చే ప్రత్యేక వ్యవస్థ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ లాంటి నగరాల్లో 52 మీటర్ల ఎత్తు వరకే చేరుకోగల అగ్నిమాపక స్కై క్రేన్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ప్రమాదం జరిగినప్పుడు పై అంతస్తుల్లో ఉన్నవారిని కాపాడటం కష్టమవుతుంది. మరి భారీ అంతస్తులున్న భవనంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి, మంటలు వ్యాపించక ముందే బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్. అవును అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు సైతం క్షేమంగా, అత్యంత వేగంగా పై అంతస్తుల నుంచి కిందికి దిగేందుకు భవనాల్లో ప్రత్యేక లిఫ్ట్‌లు ఉండాలి. ఈ లిఫ్టులు మంటల్ని తట్టుకుంటాయి. కనీసం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు మంటలను తట్టుకుని, వేగంగా పై అంతస్తుల వారిని కిందికి తీసుకొచ్చే విధంగా ఈ లిఫ్టులుంటాయి. వీటిని అగ్నిని తట్టుకునే ఫైర్ ప్రూఫ్ ప్యానెల్స్‌తో తయారు చేస్తారు.
అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఈ అత్యాధునిక ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్టులు పని చేయడానికి ప్రత్యమ్నాయ విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేస్తారు. అందుకని ఫైర్ యాక్సిడెంట్ జరిగినా విద్యుత్ అంతరాయం లేకుండా ఈ లిఫ్టులు ఆ సమయంలోను పని చేస్తాయి. ఇక ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్టులకు ప్రత్యేకమైన వెంటిలేషన్ ఏర్పాట్లు ఉంటాయి. దీనివల్ల అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దట్టమైన పొగ అలముకున్నా ఈ లిఫ్టుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించి క్రిందకు దిగవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి భారీ అంతస్తులున్న భవనాల్లో ఇలాంటి ఫైర్ లిప్టులను ఏర్పాటు చేస్తే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సులభంగా భవనంలో ఉన్నవారు ప్రమాదం బారిన పడకుండా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మిగతా సాధారణ లిఫ్టులతో పోలిస్తే ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్టుల ధర కొంత ఎక్కువే అయినా అగ్ని ప్రమాదాలను, నివాస, వాణిజ్య భవనాల్లో నివసిస్తున్న వారి భద్రతను దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం 22 అంతస్తులు దాటిన భారీ భవనాల్లో ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిబంధన తీసుకువచ్చింది. మరి కొన్ని రాష్ట్రాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో సైతం 20 అంతస్తులకు మించి నిర్మించే భవనాల్లో తప్పనిసరిగా ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్టులు ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలి.
This website uses cookies.