ప్రీలాంచుల్లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించే మోసపూరిత రియల్ సంస్థల జాబితాను తెలంగాణ రెరా అథారిటీ సిద్ధం చేసింది. నగరానికి నాలుగువైపులా దాదాపు పద్నాలుగు రియల్ సంస్థలు వేసిన వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేయకూడదని ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఈ మేరకు రెండో జాబితాను విడుదల చేయడానికి రెరా అథారిటీ సిద్ధమైందని సమాచారం. భువనతేజ ఇన్‌ఫ్రా, ఆర్‌జే హోమ్స్, ఏవీ ఇన్‌ఫ్రాకాన్ వంటి సంస్థలకు ఇదివరకే రెరా అథారిటీ నోటీసులను పంపించింది. కానీ, ఆయా కంపెనీలు ఇంతవరకూ స్పందించలేదు. రెరా నోటీసును బేఖాతరు చేస్తూ.. ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించిన ఈ సంస్థలపై ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానాను విధించడానికి రెరా అథారిటీ సమాయత్తం అవుతుందని సమాచారం.
విజయవాడ హైవే మీద గల చౌటుప్పల్, సూర్యాపేట్.. ముంబై హైవే మీద గల సంగారెడ్డి, సదాశివపేట్, నారాయణ్‌ఖేడ్.. బెంగళూరు జాతీయ రహదారి మీద గల షాద్ నగర్, జడ్చర్ల.. సాగర్ రోడ్డు, శ్రీశైలం హైవే మీద గల పలు ప్రాంతాలు.. వరంగల్ హైవే మీద ఆలేరు, యాదాద్రి వంటి ప్రాంతాల్లో.. ఈ పద్నాలుగు సంస్థలు రెరా అనుమతి లేకుండా ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్నారని తెలుసుకున్న రెరా అథారిటీ.. ఆయా వెంచర్లలో ఎవరూ కొనకూడదని కోరుతోంది. రెరా అనుమతి తీసుకున్న వెంచర్లలోనే ప్లాట్లు, ఫ్లాట్లను కొనుగోలు చేయాలని సూచిస్తోంది.
బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అనే సంస్థ కోకాపేట్లో ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించిన విషయం రెరా దృష్టికి వచ్చింది. ఇటీవల ఈ కంపెనీ రెరా కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే, ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించిన విషయం గుర్తించిన రెరా అథారిటీ.. ప్రతి ఫ్లాటు మీద రూ.25 వేలు జరిమానా విధించడానికి సమాయత్తం అవుతుంది. ఈ సంస్థ ఎంతలేదన్నా 800 ఫ్లాట్లను ప్రీలాంచ్‌లో విక్రయించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని లెక్కిస్తే.. ఎంతలేదన్నా ప్రెస్టీజ్ ఎస్టేట్స్‌పై సుమారు రూ.2 కోట్లు జరిమానా విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెరా చట్టం 2016 సెక్షన్ 3(1), 4 (1) ప్రకారం.. ఎలాంటి అనుమతుల్లేవని రెరా అథారిటీ తెలియజేసింది. రెరా చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం.. రెరా అనుమతి లేకుండా ఎలాంటి ప్లాటు కానీ ఫ్లాటు కానీ విక్రయించకూడదని స్పష్టం చేసింది. ఇక నుంచి రెరా అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు విక్రయించకూడదని.. అలా అమ్మే వాటిలో కొనుగోలు చేయకూడదని తెలియజేసింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వాణిజ్య సముదాయాల్లో కొనుగోలు చేసేవారు.. వాటికి రెరా అనుమతి ఉందా? లేదా? అనే విషయాన్ని రెరా వెబ్‌సైటులో తెలుసుకున్నాకే ముందడుగు వేయాలని సూచించింది. ఇందుకోసం రెరా వెబ్‌సైటు ((https://rerait.telangana.gov.in /SearchList /Search)ను చూడాలని కోరింది.
This website uses cookies.