Categories: TOP STORIES

రెరా జరిమానా డోంట్‌ కేర్‌..

  • నోటీసులను పట్టించుకోని అక్ర‌మార్కులు
  • సుదీర్ఘ కాలం సాగదీత
  • కాగితాల ఖర్చులూ రావ‌ట్లేదా!
  • వసూలు చేసేందుకు క‌రువైన వ్య‌వ‌స్థ
  • సహకరించని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ?

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప‌రిధిలో ఉన్న పుర‌పాల‌క శాఖ విభాగంలోని టీజీ రెరా వ్య‌వ‌స్థ దారుణంగా త‌యారైంది. నిబంధ‌న‌ల్ని పాటించ‌ని బిల్డ‌ర్ల మీద టీజీ రెరా జ‌రిమానా విధిస్తే.. వాటిని కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు, ఏజెంట్లు, రియ‌ల్ కంపెనీలు చెల్లించ‌ట్లేదు. జ‌రిమానా చెల్లించ‌క‌పోతే టీజీ రెరా అథారిటీ ఏం చేస్తుందిలే.. అంటూ లైట్ తీసుకుంటున్నారు. రెరా వ్య‌వ‌స్థ ఏర్పాటైన‌ప్ప‌ట్నుంచి.. కొన్ని సంస్థ‌ల‌కు రెరా నోటీసుల్ని జారీ చేయ‌డం.. వారి నుంచి స‌మాధానం రాక‌పోతే జ‌రిమానాలు విధించ‌డం తెలిసిందే. కాక‌పోతే, వాటిని బిల్ట‌ర్లు, ఏజెంట్లు బేఖాత‌రు చేస్తున్నారు.

రెరా చ‌ట్టం ప్ర‌కారం.. 500 గ‌జాల కంటే ఎక్కువ‌.. 8 లేదా అంత‌కంటే ఎక్కువ ఫ్లాట్ల‌ను క‌ట్టే బిల్డ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా రెరాలో న‌మోదు కావాల్సిందే. ఇప్ప‌టివ‌ర‌కూ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇత‌ర మున్సిపాలిటీల్లో సుమారు 9 వేల ప్రాజెక్టులు నమోదు కాగా.. అందులో కేవ‌లం 3800 మాత్రమే రెరాలో న‌మోద‌య్యాయి. అంటే, రెరా న‌మోదులోనే నిర్లక్షంగా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌న్న‌మాట‌. నిబంధ‌న‌ల్ని పాటించ‌ని బిల్డ‌ర్ల‌పై టీజీ రెరా భారీగానే జరిమానాల్ని విధిస్తోంది. 2022 నుంచి 2024 వరకు దాదాపు 400 ప్రాజెక్టులపై.. రూ. 50వేల నుంచి రూ. 30 లక్షల వరకు జరిమానాల్ని విధించింది. కానీ, ఆ రెండేళ్ల‌లో రెరా వసూలు చేసింది కేవలం రూ. 85 లక్షలే.

హెచ్‌ఎండీఏ, డీటీసీపీ పరిధిలోని అనధికార లేఅవుట్లు, అపార్ట్‌మెంట్ల విషయంలో రెరా నోటీసులకు దిక్కేలేదు. యాభై శాతానికిపైగా బిల్డ‌ర్లు రెరాలో న‌మోదు చేయ‌కుండానే అపార్టుమెంట్లు, వెంచ‌ర్ల‌ను విక్ర‌యిస్తున్నారు. ఇవన్నీ రెరా దృష్టికి వచ్చినా.. ఫిర్యాదు అంద‌లేద‌నే ఒకే ఒక్క‌ సాకుతో టీజీ రెరా సైలెంట్‌గా ఉంటోంది. నిజానికి, అక్రమ లేఅవుట్ల‌లో ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ కాగానే రెరాకు స‌మాచారం తెలియాలి. ఇందుకోసం రిజిస్ట్రేష‌న్ శాఖ‌తో స‌మ‌న్వ‌యం కావాలి. కానీ, ఆ దిశ‌గా ముంద‌డుగు ప‌డ‌లేదు.
2022లో 48 సంస్థలకు జ‌రిమానాలు క‌ట్ట‌మ‌ని రెరా ఆదేశిస్తే.. అందులో నాలుగంటే నాలుగే సంస్థ‌లు చెల్లించాయి.
2023లో 56 కంపెనీలకు నోటీసులివ్వగా.. వీటిలో ఒకేసారి 13 కంపెనీలకు నోటీసులిచ్చారు. ఈ 13 సంస్థలతో పాటుగా పలు సంస్థలకు పని చేస్తున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కూడా నోటీసుల్ని జారీ చేశారు. నోటీసులు అందుకున్న సంస్థల్లో నీమ్స్‌బోరో గ్రూప్, ఎక్సలెన్స్ ప్రాపర్టీస్, సనాలి గ్రూప్, అర్బన్ యార్డ్స్, హ్యాపీ డ్రీమ్ హోమ్స్, విరాటా డెవలపర్స్, రివెండెల్ ఫార్మ్స్, కావురి హిల్స్, సెవెన్ హిల్స్, బిల్డాక్స్, సుమధుర ఇన్ఫ్రా తో పాటుగా హ్యాపీ డ్రీమ్స్ ప్రాజెక్ట్ ఏజెంట్, విరాటా డెవలపర్స్ ఏజెంట్ డేవిడ్ రాజు, అర్బన్ యార్డుల ఏజెంట్ లక్ష్మీనారాయణ, సెవెన్ హిల్స్ ఏజెంట్ జె. వెంకటేష్ కు జరిమానా విధించారు. ఈ పద‌మూడు ప్రాజెక్టుల‌కు రూ.4.30 కోట్ల జ‌రిమానా విధించ‌గా.. అందులో ఒక్క సంస్థా జ‌రిమానా చెల్లించ‌లేదు. ఏజెంట్ల‌కు రూ.1.30 కోట్ల జ‌రిమానా విధించ‌గా.. వాళ్లూ క‌ట్ట‌లేదు. కానీ, ఆత‌ర్వా ఆయా సంస్థ‌లు, ఏజెంట్ల‌ను టీజీ రెరా ఏం చేసింద‌నే విష‌యాన్ని ఏలిన‌వారికే తెలియాలి.
గతేడాది ఒక కేసులో.. ఇంటి కొనుగోలుదారునికి పగడాల కన్స్ట్రక్షన్స్‌ను రూ. 12.1 లక్షలు తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చారు. బిల్డర్‌కు రూ. 2.69 లక్షల జరిమానా విధించారు. దీనిపై ఇటీవల పోలీసు కేసు పెడ‌తామని మరో నోటీసు ఇచ్చారు. కానీ, ఇంత వరకూ ఆయా సంస్థ జ‌రిమానా చెల్లించ‌లేదు.

జైలుకు పంపిస్తారా?

ఇత‌ర రాష్ట్రాల్లో రెరా అథారిటీ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. నోటీసుల‌కు బిల్డ‌ర్లు స్పందించ‌కపోతే జ‌రిమానాలు విధించ‌డం.. అప్ప‌టికీ విన‌క‌పోతే శ్రీకృష్ణ జ‌న్మ‌స్థానానికి పంపిస్తారు. గురుగ్రామ్‌లోని హర్యానా రెరా.. బ్రహ్మ సిటీపై రూ. 2.50 కోట్ల జరిమానా విధించింది. కానీ, సదరు సంస్థ ఆలస్యం చేయడంతో.. నిర్మాణ సంస్థ యాజమాన్యాన్ని 24 రోజుల పాటు జైలులో పెట్టారు. జరిమానా చెల్లించాకే విడుదల చేశారు. మ‌రి, టీజీ రెరా వ్య‌వ‌స్థ ఇంత ధైర్యంగా ఎప్పుడు వ్య‌వ‌హ‌రిస్తుంది? కొనుగోలుదారుల్ని మోసం చేసిన బిల్డ‌ర్ల‌ను ఎప్పుడు దారిలోకి తెస్తుంది?

ఇంత ఘోర‌మా?

  • 2022 నుంచి 2024- 400 ప్రాజెక్టుల‌పై- రూ. 50,000- 30 లక్షల దాకా జ‌రిమానా విధింపు.
  • వసూలు చేసింది కేవలం రూ. 85 లక్షలే.
  • 2023: 56 కంపెనీలకు నోటీసులు
  • 13 ప్రాజెక్టుల‌కు రూ.4.30 కోట్ల జ‌రిమానా
  • ఒక్క‌రూ న‌యాపైసా క‌ట్ట‌లేదు
  • ఏజెంట్ల‌పై రూ.1.30 కోట్ల జ‌రిమానా
  • ఒక్కరూ చెల్లించ‌లేదు

This website uses cookies.