ఫార్మా రంగంలో గ్లోబల్ కేపబిలటి సెంటర్లకు హబ్ గా భారత్ అవతరిస్తోంది. అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు భారత్ లో జీసీసీ ఏర్పాటుపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరోగమనంలో ఉన్నప్పటికీ.. మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండటం, వినియోగం కూడా బాగుండటంతో అవి భారత్ వైపే మొగ్గు చూపిస్తున్నాయి. 2500కి పైగా సెంటర్లు, 45 లక్షల మందికి పైగా నిపుణులతో త్వరలోనే భారత జీసీసీ మార్కెట్ పరిమాణం 100 బిలియన్ డాలర్ల మార్కును అధిగమిస్తుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక పేర్కొంది.
లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ (ఎల్ఎస్‌హెచ్‌సీ) సెగ్మెంట్లో 2024లో 100 సెంటర్లు ఉండగా.. 2030 నాటికి వీటి సంఖ్య 160కి, వీటిలో ఉద్యోగుల సంఖ్య 4,20,000కి చేరనుందని అంచనా వేసింది. భారత్‌లో టెక్నాలజీ నిపుణుల లభ్యత గ్లోబల్ కంపెనీలకు ఆకర్షణీయంగా ఉంటుండగా, ఇక్కడి వర్ధమాన స్టార్టప్ వ్యవస్థ కూడా జీసీసీల ఏర్పాటుకు మరో సానుకూలాంశంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. దిగ్గజ కంపెనీల జీసీసీల్లో నియామకాలు కూడా భారీగానే ఉంటున్నాయి. డిమాండ్, వ్యూహాత్మక ప్రాధాన్యం పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా ఫార్మా దిగ్గజాలు భారత్‌లోని తమ హబ్‌లలో జోరుగా నియామకాలు చేపడుతున్నాయి.