హైదరాబాద్ అభివృద్ధి గురించి.. రాజకీయాలు చేయకండి!
తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్
నగరం అభివృద్ధి చెందాలి తప్ప
రాజకీయాల వల్ల వృద్ధి నిలిచిపోకూడదు!
గ్రేటర్ హైదరాబాద్‌లో అనుమతి
ఎకరానికి 3-3.5 లక్షల చదరపు అడుగులే
5 లక్షల చ.అ. అనుమతి ఎక్కడా ఇవ్వలేదు
అలాగైతే 70, 80 అంతస్తుల భవనాలు రావాలి
పార్కింగ్ కోసం 33 శాతం స్థలం కేటాయించాలి
ఈ స్థలాన్ని ఎఫ్ఎస్ఐ కింద పరిగణించరు
గిరాకీ, సరఫరాలే మార్కెట్‌ను శాసిస్తాయి
అనుమతులిస్తే ఏంటీ? కొనేవారుండాలి కదా!
(కింగ్ జాన్సన్ కొయ్యడ)
హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాల సంఖ్య పెరిగిపోతున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా కోకాపేట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమతినిస్తోందని.. దేశంలోనే ఎక్కడా ఇలాంటి విధానం లేదంటూ కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలు కరెక్టు కాదు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నగరాభివృద్ధికి అనేక పార్టీలు విశేషంగా కృషి చేశాయి. అధికారంలోకి వచ్చిన ప్రతిపార్టీ, రాజకీయాలకు అతీతంగా.. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాయనడంలో సందేహం లేదు. కాబట్టి, తెలంగాణకు గుండెకాయ వంటి భాగ్యనగరానికి సంబంధించి ఎలాంటి రాజకీయాలు చేయకపోవడమే మంచిది. వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ విమర్శలు చేస్తే.. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వం ఆకాశహర్మ్యాలకు అనుమతినిచ్చినంత మాత్రాన ప్రజలు ఎడాపెడా ఇళ్లను కొనుగోలు చేయరనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. గిరాకీ, సరఫరా మీద రియాల్టీ మార్కెట్ ఆధారపడుతుందే తప్ప.. అనుమతులిచ్చినంత మాత్రాన ప్రజలు కొనుగోలు చేస్తారనే గ్యారెంటీ లేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.
ప్రస్తుతం ప్రభుత్వమే ఆకాశహర్మ్యాలకు అనుమతిని మంజూరు చేయట్లేదనే విషయాన్ని రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2006లో అపరిమిత ఎఫ్ఎస్ఐకి సంబంధించిన జీవోను విడుదల చేశారు. ప్లాటు సైజు, దాన్ని ముందున్న రోడ్డు వెడల్పును బట్టి ఎంత ఎత్తుకైనా అపార్టుమెంట్లను కట్టే వెసులుబాటును కల్పించారు. ఫలితంగా, అప్పట్నుంచి బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాలను నిర్మించే సంస్కృతి మొదలైంది. మణికొండలో ల్యాంకోహిల్స్ కానీ కేపీహెచ్‌బీ కాలనీలో లోధా టవర్స్ కానీ అప్పుడు వచ్చినవే కావడం గమనార్హం. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నలగండ్ల, తెల్లాపూర్, నానక్‌రాంగూడ, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో పలు నిర్మాణ సంస్థలు ఆకాశహర్మ్యాల్ని ఆరంభించాయి. అంతేతప్ప, ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వమే కొత్తగా ఆకాశహర్మ్యాలకు విచ్చలవిడిగా అనుమతినిస్తుందని ఆరోపించడం కరెక్టు కాదు.
హైదరాబాద్‌లో ఎకరానికి 5 లక్షల చదరపు అడుగుల చొప్పున జీహెచ్ఎంసీ కానీ హెచ్ఎండీఏ కానీ అనుమతిని మంజూరు చేయలేదు. జీహెచ్ఎంసీలో మహా అయితే 3 నుంచి 3.5 లక్షల చదరపు అడుగుల చొప్పున అనుమతినిచ్చారు. హెచ్ఎండీఏ పరిధిలో గరిష్ఠంగా ఎకరానికి 3 లక్షల చదరపు అడుగుల వరకే పర్మిషన్ ఇచ్చారు. ఒకవేళ 5 లక్షల చదరపు అడుగుల మేరకు అనుమతినివ్వాలంటే.. హైదరాబాద్‌లో 70 నుంచి 80 అంతస్తుల ఎత్తులో ఆకాశహర్మ్యాలు రావాలి. కానీ, మన వద్ద 50 అంతస్తుల ఎత్తులో కేవలం మూడు నాలుగు ప్రాజెక్టులే ఉండటం గమనార్హం. ఎందుకంటే, ఎంత ఎత్తుకు వెళ్లే కొద్దీ అంతే స్థాయిలో నిర్మాణ వ్యయం పెరుగుతుందనే విషయాన్ని గుర్తించాలి.
ప్రతి ఆకాశహర్మ్యంలో 33 శాతం స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించాలనే నిబంధన ఉంది. ఈ స్థలాన్ని ఎఫ్ఎస్ఐ కింద పరిగణించరనే విషయాన్ని గమనించాలి. అయినా, ఆకాశహర్మ్యాల్ని కట్టే ప్రతి నిర్మాణ సంస్థ వీలైనంత అధిక శాతం పార్కింగ్ స్థలాన్ని కేటాయించడానికే మొగ్గు చూపుతుందనే విషయాన్ని గమనించాలి. బహుళ అంతస్తుల నిర్మాణాలు, ఆకాశహర్మ్యాల్ని నిర్మించేవారు విధిగా అగ్నిమాపక నిబంధనల్ని పాటిస్తారు. వీటిని పాటించకపోతే ఏ నిర్మాణానికి అనుమతి లభించదు.
గిరాకీ మరియు సరఫరా
హైదరాబాద్‌లో రియల్ మార్కెట్ అభివృద్ధి అనేది గిరాకీ, సరఫరాల మధ్య ఆధారపడుతుంది. అంతేతప్ప, ఆకాశహర్య్మాలకు అనుమతి ఇచ్చినంత మాత్రాన.. కొనుగోలుదారులు వేలంవెర్రిలా కొనుగోలు చేస్తారనే గ్యారెంటీ లేదు.
ఆయా ప్రాజెక్టులు నచ్చితేనే ప్రజలు కొంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం రాయదుర్గం, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, నలగండ్ల, తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, కొల్లూరు, కోకాపేట్, పొప్పాల్‌గూడ, నార్సింగి, మంచిరేవుల వంటి ప్రాంతాల్లో దాదాపు 75 వేల ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. అప్పా జంక్షన్, కిస్మత్ పూర్, బండ్లగూడ, పిరంచెరువు వంటి ప్రాంతాల్లో 10 వేలు, మియాపూర్ నుంచి గండిమైసమ్మ దాకా మరో 15 వేల ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. ఇవన్నీ వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో పూర్తయ్యే నిర్మాణాలు. మరి, వీటికి ఏ మేరకు గిరాకీ ఉంటుంది? మారిన ఆర్థిక పరిస్థితులు, పెరిగిన గృహరుణ వడ్డీ రేట్లు, అధికమైన ఫ్లాట్ల ధరలు, ఎన్నికల సంవత్సరం వంటి అంశాల కారణంగా.. ఈ ఏడాదిలో కొనుగోలుదారులు ఫ్లాట్లను కొనేందుకు ముందుకు రాకపోతే ఎలా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసినంత మాత్రాన వాటిని కొనుగోలు చేయమని ప్రజలకు చెప్పదు కదా?
నగరం ఏదైనా అభివృద్ధి చెందిందని చెప్పడానికి అక్కడ దర్శనమిచ్చే ఆకాశహర్మ్యాలే నిదర్శనం. మలేసియా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్రమంలో కోకాపేట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశహర్మ్యాల్ని అనుమతించాలనే నిబంధన ఇప్పటిది కాదు. 2006లో విడుదల చేసిన జీవోలోనే పేర్కొన్నారు.. పైగా, అప్పటి ప్రభుత్వం అక్కడ వేలం పాటల్ని కూడా నిర్వహించిందనే విషయాన్ని మర్చిపోవద్దు. అప్పటితో పోల్చితే ప్రస్తుతం మార్కెట్ వృద్ధి చెందడం.. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఆకాశహర్మ్యాల్ని కొనుగోలు చేస్తున్నారు. అందుకే, నిర్మాణ సంస్థలు వాటిని నిర్మిస్తున్నాయి.