- ఫ్లైఓవర్ పై వాహనాలు.. దానిపై మెట్రో రైలు
- మెట్రో మూడు దశ విస్తరణకు సర్కారు నిర్ణయం
దేశంలో వేగవంతమైన అభివృద్ధిలో దూసుకెళ్తున్న హైదరాబాద్ లో ప్రజా రవాణా మరింత మెరుగు కానుంది. ఇందుకోసం మెట్రో రైల్ ను భారీగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.69,100 కోట్ల వ్యయంతో మెట్రో మూడో దశ చేపట్టడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో తొలి విడత కింద 70 కిలోమీటర్ల మేర మెట్రో పనులు పూర్తయి.. కార్యకలాపాలు నడుస్తున్నాయి. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీస్, నాగోలు నుంచి రాయ్ దుర్గ్ వరకు మూడు రూట్లలో మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. ఇక రెండో దశ కింద రాయ్ దుర్గ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం మధ్య మెట్రో రైలు నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అలాగే బీహెచ్ఈఎల్ నుంచి లకడీకాపూల్, నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా రూట్లకు సంబంధించి ప్రణాళికలు సిద్ధమయ్యయి. తాజాగా మెట్రో మూడో దశకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
మెట్రో మూడో దశ వివరాలివీ..
- జూబ్లీ బస్టాండ్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ తరహాలో మెట్రో రైల్ మార్గం. ఒక లెవల్‌లో వాహనాలు, దానిపై లెవల్‌లో మెట్రో రైలు మార్గం నిర్మిస్తారు. 17 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో 13 స్టేషన్లు ఉంటాయి.
- ఆదిలాబాద్-నాగ్‌పూర్ రూట్‌లో ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ మెట్రో రైల్ మార్గం. ఇందులో 12 కిలోమీటర్ల మెట్రో మార్గం, 10 స్టేషన్లు ఉంటాయి.
- బీహెచ్ఈఎల్-పటాన్ చెరు-ఇస్నాపూర్ మార్గం. 13 కిలోమీటర్ల పొడవుంటే ఈ రూట్ లో 8 స్టేషన్లు నిర్మిస్తారు.
- అలాగే మియాపూర్- లక్డీకాపూల్ మధ్య మరో మార్గం నిర్మాణం.
- ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ మీదుగా పెద్ద అంబర్‌పేట్ వరకు 13 కిలోమీటర్ల మేర 8 స్టేషన్లతో మరో రూట్.
- ఉప్పల్ నుంచి ఘట్కేసర్ మీదుగా బీబీ నగర్ వరకు 25 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం. ఇందులో 10 స్టేషన్లు ఏర్పాటు చేస్తారు.
- శంషాబాద్ నుంచి కొత్తూరు మీదుగా షాద్‌నగర్ వరకు 6 స్టేషన్లతో 28 కిలోమీటర్ల పొడవైన కొత్త రూట్ నిర్మాణం.
- తార్నాక నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ వరకు 8 కిలోమీటర్లలో 5 స్టేషన్లతో మెట్రో విస్తరణ.
- 159 కిలోమీటర్ల పొడవునా ఓఆర్‌ఆర్ పక్కన మెట్రో నిర్మాణం. ఇందులో శంషాబాద్ ఓఆర్‌ఆర్-తుక్కుగూడ-బొంగులూరు-పెద్దఅంబర్‌పేట్ రూట్లో 5 స్టేషన్లతో 40 కిలోమీటర్ల మేర మెట్రో రైలు రానుంది. అలాగే పెద్ద అంబర్‌పేట్ ఓఆర్‌ఆర్-ఘట్కేసర్-షామీర్‌పేట్-మేడ్చల్ మార్గంలో 5 స్టేషన్లతో 45 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ఏర్పాటు చేస్తారు. మేడ్చల్-దుండిగల్-పటాన్‌చెరు మార్గంలో 29 కిలోమీటర్లలో 4 స్టేషన్లతో కొత్త రూట్ రానుంది. అలాగే పటాన్‌చెరు-కోకాపేట్-నార్సింగ్ మార్గంలో 3 స్టేషన్లతో 22 కిలోమీటర్ల మేర మరో రూట్ నిర్మిస్తారు.
ఎన్నికల స్టంటా.. పదేళ్లకైనా పూర్తయ్యేనా..
సుమారు అరవై వేల కోట్ల రూపాయలను వెచ్చించి.. నగరం నాలుగు వైపులా.. మెట్రో రైలును ఏర్పాటు చేస్తామని తెలంగాణ మంత్రివర్గం తాజాగా నిర్ణయం తీసుకున్నది. అంటే, ఈ నిర్ణయాన్ని అసెంబ్లీలో పాస్ చేసి.. నిర్మాణ పనుల్ని ఆరంభించడానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేం. కొత్త మెట్రో మార్గాల గురించి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్డు తయారు చేసి.. నిధుల గురించి స్పష్టత వచ్చేంత వరకు ఎంత సమయం పడుతుందో ఇప్పుడేం కచ్చితంగా చెప్పలేం. అంటే, కేంద్ర నుంచి సాయం తీసుకుని ఈ ప్రాజెక్టును చేపడతారా? పబ్లిక్, ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌లో చేస్తారా? అనే అంశం ఇంకా తెలియాల్సి ఉంది. కాకపోతే, సంతోషించాల్సిన విషయం ఏమిటంటే.. ఇప్పుడే కాకపోయినా.. ఓ పదేళ్ల తర్వాతనైనా.. ఇస్నాపూర్, కండ్లకోయ, షాద్ నగర్, పెద్ద అంబర్‌పేట్ దాకా మెట్రో రైలు ఫెసిలిటీ అయితే అందుబాటులోకి వస్తుందని చెప్పొచ్చు.
సమస్య ఎక్కడొస్తుందంటే.. భవిష్యత్తులో వచ్చే మెట్రో రైలును చూపెట్టి.. కొందరు ఏజెంట్లు, స్థలయజమానులు, రియాల్టీ కంపెనీలేం చేస్తాయంటే.. పదేళ్ల తర్వాత పెరగాల్సిన భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల ధరల్ని ఇప్పుడే పెంచేసే పనిలో పడతాయి. అంటే, మెట్రో రైలుకు సంబంధించిన ప్రకటన.. రేట్లు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప.. ఇప్పుడిప్పుడే మెట్రో రైలు నిర్మాణ పనులు ఆరంభం కావని గుర్తుంచుకోండి. ఎందుకంటే, గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇదేవిధంగా మెట్రో రైలు సెకండ్ ఫేజు గురించి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు పనులకు టీఎస్‌పీఏ జంక్షన్‌లో శంకుస్థాపన చేశారు. కాకపోతే, అది పూర్తవ్వడానికి మరో మూడేళ్లయినా పడుతుంది. అంటే, ఈ ఒక్క లైను పూర్తవ్వడానికే ఎనిమిదేళ్లకు పైగా పడితే.. ప్రభుత్వం చెప్పే అన్నీ మెట్రో రూట్లలో పనులు ఆరంభమై పూర్తవ్వడానికి ఎంతకాలం పడుతుందో ఒక్కసారిగా వాస్తవికంగా ఆలోచించండి.