-
అనుమతుల్లేవు.. అయినా జోరుగా అక్రమ కట్టడాలు
-
హెచ్ఎండీఏను పట్టించుకోని కొందరు బిల్డర్లు
-
చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు
-
ప్రకృతిలో పరవశం అంటూ విల్లాల నిర్మాణం
-
అనుమతి లేకున్నా కొంటున్న బయ్యర్లు
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి ప్రభుత్వం పూర్తి స్థాయి ఛైర్మన్‌ను నియమించింది. దీంతో ఒక్కసారిగా ప్రీలాంచ్ ప్రమోటర్లు, అక్రమ బిల్డర్లు అప్రమత్తం అయ్యారు. ఇక తమ ఆటలు సాగవని అర్థం చేసుకుని ప్రీలాంచ్ అమ్మకాల్ని క్రమక్రమంగా తగ్గిస్తున్నారు. కొందరు బిల్డర్లు అయితే, స్థానిక సంస్థ నుంచి కానీ రెరా నుంచి కానీ ఎలాంటి అనుమతుల్ని తీసుకోకుండానే.. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో అక్రమ నిర్మాణాల్ని పోటీపడి కడుతున్నారు. ఇందులో చిన్న స్థాయి బిల్డర్లతో పాటు బడాస్థాయి డెవలపర్లు ఉండటం గమనార్హం.
కొందరు తెలివిగా ఏం చేస్తున్నారంటే.. పాత, కొత్త సర్పంచిలకు డబ్బులు ఎరవేసి.. పంచాయతీ అనుమతి తీసుకుని కడుతున్నట్లు నాటకాలేస్తున్నారు. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో పంచాయతీ అనుమతి ఏమిటో మరి ఆయా డెవలపర్లకే తెలియాలి. పైగా, భారీ స్థాయిలో విల్లాల్ని కడుతున్నప్పటికీ ఇలాంటి వారు రెరా అనుమతిని తీసుకోవట్లేదు. ప్రభుత్వం పేరుకే ట్రిపుల్ వన్ జీవోను తొలగించేసింది కానీ.. ఈ ప్రాంతాల్లో అధికారికంగా ఎలాంటి అనుమతిని మంజూరు చేయట్లేదు. ఇదే అదనుగా భావించిన కొందరు బిల్డర్లు ఎక్కడపడితే అక్కడ ఫామ్ హౌజులని, వీకెండ్ విల్లాల పేరిట వీటిని నిర్మిస్తున్నారు. కోట్ల రూపాయలకు వాటిని విక్రయిస్తున్నారు. ట్రిపుల్ వన్ జీవోకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఎప్పుడొస్తుందో తెలియదు.. అసలొస్తుందో రాదో కూడా తెలియదు.. కానీ, ఈ లోపు ట్రిపుల్ వన్ జీవోలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి.
నిన్నటివరకూ పచ్చదనంతో విలసిల్లిన ఆ ప్రాంతాలన్నీ రానున్న రోజుల్లో అక్రమ నిర్మాణాలతో కాంక్రీటు జంగిల్లా మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి, ఈ కట్టడాల్లో నివసించేవారి వల్ల విడుదలయ్యే మురుగునీరు ఎక్కడికి పోతుంది? ఇప్పటికైనా పురపాలక శాఖ మరియు హెచ్ఎండీఏ అధికారులు ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్లో ఈ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలి. లేకపోతే మనమంతా భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేసినవారం అవుతామని మర్చిపోవద్దు.