ప్రీలాంచులతో ప్రజల్ని మోసం చేసిన సాహితీ సంస్థ ఎండీ లక్ష్మీనారాయణకు ఈడీ గట్టి షాకునిచ్చింది. సాహితీ సంస్థకు చెందిన సుమారు రూ.161.50 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది.పీఎంఎల్ఏ 2002 చట్టం ప్రకారం.. సాహితీ ఎండీ బి. లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ ఎస్. పూర్ణచంద్రరావు, కుటుంబ సభ్యులు, ఒమిక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు చెందిన ఆస్తులన్నింటినీ ఈడీ అటాచ్ చేసింది.
ఈడీ నిర్ణయం..
కొన్నవారిలో ధైర్యం!
అమీన్‌పూర్‌లో ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయించి కోట్ల రూపాయల్ని వసూలు చేసిన సాహితీ గ్రూప్ ఎండీ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేయడంతో కొనుగోలుదారులకు సరికొత్త భరోసా ఏర్పడింది. కాస్త ఆలస్యమైనా తమ సొమ్ము వెనక్కి వస్తుందనే విశ్వాసం ఏర్పడింది. మొత్తం కాకపోయినా, ఎంతో కొంత సొమ్ము వెనక్కి వచ్చే అవకాశముందనే నమ్మకమైతే వచ్చింది. కాకపోతే, ఈడీ మరింత లోతుగా అధ్యయనం చేసి.. సాహితీ ఎండీ ఇంకా ఏయే కంపెనీల్లో పెట్టుబడి పెట్టాడు? ఎక్కడెక్కడ ఆస్తుల్ని కూడబెట్టాడు? ఎక్కడెక్కడ భూముల్ని కొన్నాడు? అతని పేరు మీదతో పాటు కుటుంబ సభ్యులు, బినామీ పేర్ల మీద ఎక్కడెక్కడ కొనుగోలు చేశాడనే అంశంపై లోతైన దర్యాప్తు జరపాలని బాధితులు కోరుతున్నారు. అలా చేస్తేనే తమ సొమ్ము చేతికొస్తుందని.. మోసం చేయాలనే ఆలోచనలున్నవారు వెనక్కి తగ్గే అవకాశముందని అంటున్నారు.