- పదేళ్ల నుంచి కొనుగోలుదారుల నుంచి
అక్రమంగా సొమ్ము వసూలు - ఆయా సొమ్మును దారి మళ్లించిన మంత్రి
- సుశీల్ మంత్రిపై కేసులు పెట్టిన బయ్యర్లు
- కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న కొనుగోలుదారులు
బెంగళూరుకు చెందిన మంత్రి డెవలపర్స్ గత పదేళ్ల నుంచి అమాయక కొనుగోలుదారుల నుంచి అక్రమంగా కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. ఆకర్షణీయమైన స్కీములతో బయ్యర్లు, పెట్టబడిదారుల్ని ఆకర్షించింది. అలా వసూలు చేసిన సొమ్మును ఇతర ప్రాజెక్టులకు దారి మళ్లించింది. సొంత అవసరాల కోసం వినియోగించింది. ఫలితంగా, కొనుగోలుదారులకు సకాలంలో ఫ్లాట్లను అందించడంలో ఘోరంగా విఫలమైంది. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో అందులో కొన్నవారంతా ఒక్కసారిగా రోడ్డు మీదికెక్కారు. ధర్నాలు నిర్వహించారు. పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ 2022 జూన్ 24న మంత్రి ఫౌండర్, ప్రమోటర్ అయిన సుశీల్ మంత్రిని అరెస్టు చేసింది. ఈ క్రమంలో మంత్రి గ్రూపునకు చెందిన రూ.300.4 కోట్ల ఆస్తుల్ని శుక్రవారం ఈడీ జప్తు చేసింది.
మంత్రి డెవలపర్స్ బెంగళూరులో మంత్రి సెరినిటీ, మంత్రి వెబ్ సిటీ, మంత్రి ఎనర్జియా అనే మూడు ప్రాజెక్టుల్ని ఆరంభించి.. రకరకాల స్కీముల పేరిట కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. ఇందుకోసం క్యాజిల్స్ విస్టా ప్రైవేట్ లిమిటెడ్, బయాంట్ టెక్నాలజీ కాన్ స్టెలేషన్స్ అనే అనుబంధ సంస్థల్ని ఏర్పాటు చేసి.. రకరకాల స్కీముల పేరిట కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయల్ని దండుకుంది. మోసపూరిత పథకాలు, తప్పుడు సమాచారాన్ని అందించే బ్రోచర్లతో బయ్యర్లను బోల్తా కొట్టించింది. వీరి నుంచి డిపాజిట్లు వసూలు చేసి ఏడు నుంచి పదేళ్లు గడిచినా ఫ్లాట్లను అందించడంలో విఫలమైంది.