హైదరాబాద్ నిర్మాణ రంగం సరికొత్త పుంతలు తొక్కుతున్నది. నివాసితులకు సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా కొందరు బిల్డర్లు ప్రణాళికల్ని రచిస్తున్నారు. స్థలం దొరికితే అపార్టుమెంట్ కట్టేశామా.. అమ్మేశామా.. అన్నట్లుగా కొందరు బిల్డర్లు భావించట్లేదు. ప్రజలకు అన్నివిధాల నచ్చే.. ఉపయోగపడే థీమ్ ను ఎంచుకుంటున్నారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ పోకడల్ని అధ్యయనం చేసి.. నిపుణులతో చర్చించి.. సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. థీమ్ ఆధారిత ప్రాజెక్టుల్ని ప్రకటిస్తున్నారు. నిర్ణీత గడువు కంటే ముందే అందులోని ఫ్లాట్లను వేడిపకోడిల్లా విక్రయిస్తున్నారు.
బెంగళూరుకు చెందిన టోటల్ ఎన్విరాన్మెంట్ సంస్థ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ద మిడో డ్యాన్స్ అనే ప్రాజెక్టును చేపట్టింది. ఆలోచనాత్మకమైన డిజైన్లు, ప్రకృతికి సమీపంలో ఉండే డిజైన్లకు ఈ ప్రాజెక్టులో పెద్ద పీట వేశారు. మేడ్చల్‌లోని 400 ఎకరాల జయదర్శిని టౌన్ షిప్పులో 15 ఎకరాల్లో.. అద్వైత్ రిటైర్మెంట్ హోమ్స్ పదిహేను ఎకరాల్లో 166 విల్లాల్ని నిర్మిస్తోంది. గోల్ఫ్ కోర్సులను ఆరంభించి.. అందులోనే విల్లా ప్లాట్లను పలు సంస్థలు నగరంలో విక్రయిస్తున్నాయి. వీటిని గోల్ఫ్ కమ్యూనిటీలుగా పిలుస్తున్నారు. కాలుష్యరహిమైన ఆవాసాల్లో నివసించాలని కోరుకునేవారికి నాంది అనే సంస్థ పర్యావరణ నివాసాల్ని సృష్టిస్తోంది. ప్రకృతిపై అవగాహన ఉన్నవారు.. పట్టణ శుద్ధీకరణ మరియు గ్రామీణ ప్రాంతాల వాతావరణాన్ని కోరుకునేవారికి నిజామాబాద్, చేవేళ్లలో విల్లా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఇక, జనప్రియ ఇంజినీర్స్ వికారాబాద్ చేరువలో ఆధునిక ఫామ్ హౌజ్‌లకు పెద్దపీట వేసింది.
సంతోషమే ఒక థీమ్..
నగరానికి చెందిన గిరిధారి హోమ్స్ సంతోషం అనే థీమ్ ఆధారంగా సరికొత్త లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీని ప్రారంభించింది. కాలుష్యం లేని, మంచి గాలిని పీల్చుకోవడానికి సంపూర్ణ అవకాశమున్న కిస్మత్ పూర్ ప్రాంతాన్ని ఇందుకోసం ఎంచుకున్నది. ఈ క్లబ్హౌజులోకి వచ్చేవారికి ఆనందాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో.. హ్యాపీ బాడీస్, హ్యాపీ మైండ్స్, హ్యాపీ సోల్స్, హ్యాపీ హార్ట్స్ అనే సరికొత్త కాన్సెప్టును ఎంచుకుంది. మొత్తానికి, నలభైకి పైగా పేర్లు, హ్యాపినెస్‌ను ప్రేరేపించే చిహ్నాలను ఎంచుకున్నారు.