ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ అతివేగంగా అభివృద్ధి చెందుతోంది.. కొత్త రాజధాని ఇక్కడే వస్తుందనే ప్రతిపాదనలూ ఉన్నాయి.. పైగా ప్లాట్లు, ఫ్లాట్ల ధరలు అందుబాటులో ఉండటం.. అధిక శాతం పెట్టుబడిదారులు అమరావతి బదులు వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల వైపు దృష్టి సారించడం.. అమెరికా, యూకే, గల్ఫ్ ప్రాంతాలకు చెందిన వైజాగ్ వాసులు ఇక్కడే ప్లాట్లు, ఫ్లాట్లు కొనడం వంటి అంశాల వల్ల వైజాగ్ రియల్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని నరెడ్కో వైజాగ్ అధ్యక్షుడు నరసింహా రాజు
తెలిపారు. వైజాగ్ స్థిరాస్తి రంగం తాజా పోకడలు, పలు ప్రాంతాల్లో ధరలు, భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాల గురించి ఆయన రియల్ ఎస్టేట్ గురుకి ప్రత్యేకంగా వివరించారు. సారాంశం ఆయన మాటల్లోనే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిగా వైజాగ్‌ను ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. ఇది సాకారమైతే ఎండాడ, మధురవాడ, కొమ్మాది, ఆనందపురం వంటివి హాట్ లొకేషన్లుగా అవతరిస్తాయి. బీచ్ రోడ్డు, జాతీయ రహదారికి కనెక్టివిటీ ఉండటం వల్ల పెట్టుబడిదారులూ ఎక్కువ ఈ ప్రాంతాల వైపే దృష్టి సారిస్తున్నారు. సహజంగా వైజాగ్ మరియు ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులతో పాటు అమెరికా, గల్ఫ్, యూకే వంటి దేశాల్లో స్థిరపడినవారు ఇక్కడే స్థిరాస్తిపై పెట్టుబడి పెడుతుంటారు. రాజమండ్రి, కాకినాడ వంటి ప్రాంతాలకు చెందిన వ్యాపారులు అమరావతి బదులు ప్రస్తుతం వైజాగ్ వైపు దృష్టి సారిస్తున్నారు. భీమిలి, తగరవలస, బోగాపురం వరకూ ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు.
వైజాగ్లో ప్రతిఏటా ఐదు నుంచి ఆరు వేల దాకా ఫ్లాట్లు అమ్ముడవుతుంటాయి. గేటెడ్ కమ్యూనిటీలు పది వరకూ నిర్మాణంలో ఉండగా.. పలు ప్రాంతాల్లో స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్ల నిర్మాణం ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే, గిరాకీ తగ్గ సరఫరా మాత్రమే ప్రస్తుతం వైజాగ్‌లో కొనసాగుతోంది. బకనపాలెం ఏరియాలో చిన్న ప్లాట్లే ఉన్నాయి. కాబట్టి, అక్కడ పది ఫ్లాట్లను కట్టే డెవలపర్లు ఉన్నారు. గిరాకీ, సరఫరా విషయానికి వస్తే.. వైజాగ్‌లో ఆరు నెలల్నుంచి ఏడాదిలోపు అపార్టుమెంట్లు అమ్ముడవుతున్నాయి. ఒకవేళ, ప్రస్తుతం నిర్మాణాలు జరుపుకుంటున్న ప్రాంతాల్లో కొత్త గేటెడ్ కమ్యూనిటీలు వచ్చినా ఇబ్బందేం ఉండదు. గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా నాలుగైదు ఎకరాల్లోనే నిర్మిస్తున్నారు.ఇతర మెట్రోల మాదిరిగా అధిక విస్తీర్ణంలో.. వేల కొద్దీ ఫ్లాట్లు కట్టడం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. కాబట్టి, గిరాకీ కంటే సరఫరా తక్కువే ఉంది.
వైజాగ్లో ఫ్లాట్ల విషయానికి వస్తే.. ఎండాడలో చదరపు అడుక్కీ రూ.6000కు అటుఇటుగా చెబుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లో ఇంకా ఎక్కువకే విక్రయిస్తున్న ప్రాజెక్టులున్నాయి. మధురవాడలో రూ. 4000 నుంచి రూ. 5000 దాకా రేటు పలుకుతోంది. ప్రస్తుతం పలు నిర్మాణాలు ఇక్కడ జరుపుకుంటున్నాయి. ఫార్మా ఉద్యోగులు తగరవలస వైపు దృష్టి సారిస్తున్నారు. అక్కడైతే ప్రస్తుతం రేట్లు తక్కువగా ఉన్నాయి. లేఅవుట్ల విషయానికి వస్తే.. భీమిలి చుట్టుపక్కల ప్రాంతాల్లో చదరపు గజానికి రూ.15 నుంచి 20 వేల దాకా చెబుతున్నారు. భోగాపురంలో 7-8 వేలు, కాపులుప్పాడలో 20 నుంచి 25 వేలు ఉంటుంది.
వైజాగ్ రియల్ రంగంలో దాదాపు పదిహేనేళ్ల నుంచి ఉన్నాను. ఇప్పటివరకూ దాదాపు వెయ్యి ఫ్లాట్లను అభివృద్ధి చేశాను. కొత్త నిర్మాణాల్ని ఆరంభించేందుకు ప్రణాళికల్ని చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వైజాగ్ అవతరిస్తే ధరలు అతివేగంగా పెరగడానికి ఆస్కారముంది. పైగా, ఇది సుందరమైన నగరం.. అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విడిగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం గణనీయంగా వృద్ధి చెందడానికి ఆస్కారముంది. కాబట్టి, పెట్టుబడి కోసమైనా, స్థిర నివాసానికైనా వైజాగ్‌ను ఎంచుకోవడానికిదే సరైన సమయమని కచ్చితంగా చెప్పగలను.
This website uses cookies.