Categories: TOP STORIES

సాహితీ బాటలోనే ఫార్చ్యూన్ 99 హోమ్స్

  • రెరా నోటీసును ప‌ట్టించుకోని
    ఫార్చ్యూన్ 99 హోమ్స్!
  • ప్లాట్లు కొన్న‌వారికి శ‌ఠ‌గోపం
  • సొమ్ము ఇస్తామ‌ని ఎంవోయూ
  • ఇంకా పూర్తిగా జ‌ర‌గ‌ని చెల్లింపులు
  • ఎందుకు వెంచ‌ర్ ఆరంభం కాలేదు?
  • పేరు మార్చేసిన ఫార్చ్యూన్ 99 హోమ్స్‌
  • ఇక నుంచి లావోరా డెవ‌ల‌ప‌ర్స్‌!

హైద‌రాబాద్ రియాల్టీ మార్కెట్ అక్ర‌మార్కుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారింది.. మాయ‌మాట‌లు చెప్పి ఇక్క‌డి స్థ‌ల య‌జ‌మానుల్ని బురిడీ కొట్టించుచ్చు.. అర‌చేతిలో స్వ‌ర్గం చూపెట్టి.. బ‌య్య‌ర్ల నుంచి సొమ్ము దండుకోవ‌చ్చు.. అనుమ‌తులు లేకున్నా లంచాలిచ్చి అధికారుల్ని మేనేజ్ చేయ‌వ‌చ్చు.. డ‌బ్బుల‌ను ఎర‌వేసి ఎవ‌రో ఒక రాజకీయ నాయకుడి మ‌ద్ధ‌తు తీసుకోవ‌చ్చు.. అవ‌స‌ర‌మైతే కంపెనీ పేరు కూడా మార్చి మ‌రోసారి ద‌ర్జాగా మోసం చేయ‌వ‌చ్చు. ఇలా ఎంత‌మంది బ‌య్య‌ర్ల‌ను మోసం చేసినా ప్ర‌భుత్వం పెద్ద‌గా ప‌ట్టించుకోదు. రెరా వంటి అధికారులూ అస‌లే ప‌ట్టించుకోరు. య‌థా రాజా త‌థా ప్ర‌జా అంటే ఇదేన‌మో!

ఫార్చ్యూన్ 99 హోమ్స్ అనే రియ‌ల్ సంస్థకు ఎండీలుగా కోటా విజ‌య్‌, రోసిరెడ్డి మ‌ద్దిరాల వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వీరి ప్ర‌ధాన కార్యాల‌యం బంజారాహిల్స్ ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ ప‌క్క గ‌ల్లీలోని సైబ‌ర్ హైట్స్‌లో ఉంది. ఈ సంస్థ ఏం చేసిందంటే.. ప్ర‌భుత్వం అభివృద్ధి చేస్తున్న ఫార్మా సిటీకి చేరువ‌లో.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ముచ్చర్లలో.. ఎస్సీఎస్ ఫార్చూన్ మెడిసిటీ అనే వెంచ‌ర్‌ను.. 2020 సెప్టెంబర్‌లో వెంచ‌ర్‌ను ప్రారంభించింది.

అస‌లే ఫార్మా సిటీ.. ప్ర‌పంచ స‌దుపాయాల‌తో ప్ర‌భుత్వమెంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అభివృద్ధి చేస్తోంది. దీంతో, ఇక్క‌డ ప్లాట్ల‌ను కొనుక్కుంటే భ‌విష్య‌త్తులో ధ‌ర పెరుగుతుంద‌నే ఆలోచ‌న సాధార‌ణంగా చాలామందికి క‌లుగుతుంది. కాక‌పోతే, కొంద‌రేమో ధర ఎక్కువగా ఉంటుంద‌నే ఉద్దేశ్యంతో.. వెన‌కా ముందు అవుతుంటారు. ఇలాంటి వారికి రేటు త‌క్కువ‌ని చెబితే ఎలాగైనా కొంటార‌నే ఉద్దేశ్యంతో.. సంస్థ ప్రీలాంచ్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఏజెంట్లు రంగంలోకి దిగారు. కొంద‌రు రూ.2 ల‌క్ష‌లు అడ్వాన్సు చెల్లిస్తే.. మ‌రికొంద‌రు స‌గం మొత్తం.. ఇంకొంద‌రు మొత్తం సొమ్ము చెల్లించారు. ఈ విష‌యం గురించి తెలుసుకున్న తెలంగాణ రెరా అథారిటీ.. య‌ధావిధిగా నోటీసును అంద‌జేసి త‌న ప‌ని త‌ను చూసుకుంది.

ఇంత‌లో స‌మ‌యం గిర్రున తిరుగుతోంది. వెంచ‌ర్ మాత్రం ఆరంభం కాలేదు. ఇంతలో కొన్న‌వారిలో ఆందోళ‌న ఆరంభ‌మైంది. కేబీఆర్ పార్కు ద‌గ్గ‌ర కొంత హల్చల్ చేశారు. కంగారు ప‌డిన సంస్థ ఎండీలు మద్దిరాల రోసిరెడ్డి, కోట విజయబాబులు బాధితులతో సెప్టెంబర్ 19న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు స్టాంపు పేప‌ర్ మీద స్పష్టంగా రాసుకుని.. రెండువైపులా సంతకాలూ చేశారు. అందులోనే ప్రీలాంచ్ కింద ఎస్సీఎస్ ఫార్చూన్ మెడిసిటీ వెంచర్‌లో ప్లాట్లు విక్రయించినట్లు జంట ఎండీలు ఒప్పుకున్నారు. 180 రోజుల్లో మొత్తం సొమ్ము తిరిగి ఇచ్చేస్తామని రాసిచ్చారు. డబ్బు కోసం ఒత్తిడి చేసిన 26 మందితో మాత్రమే ఎంఓయూ కుదుర్చుకున్న విష‌యం తెలుసుకున్న మిగ‌తా వారు.. తమ డబ్బులు ఇవ్వాలని ఎండీపై బాధితులు ఒత్తిడి తెస్తున్నారు. అయితే మూడు నెల‌లు గ‌డిచినా సొమ్ము చేతికి రాక‌పోవ‌డంతో.. కొంద‌రు బాధితులు క‌లిసి బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్‌ని ఆశ్ర‌యించారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థ ఎండీలు కార్యాలయానికి రాకుండా తప్పించుకు తిరుగుతున్నట్టు సమాచారం.

పేరు మార్చి.. ఇంకెంత‌మందిని..?

ఫార్చ్యూన్ 99 హోమ్స్ ప‌రువు పోయింద‌ని అనుకున్నారో.. మ‌రేంటో తెలియ‌దు కానీ.. ఈ సంస్థ ఎండీలు స‌రికొత్త ఎత్తుగ‌డ వేశారు. ఫార్చ్యూన్ 99 హోమ్స్ సంస్థ‌ను లావోరా డెవ‌ల‌ప‌ర్స్ గా పేరు మార్చివేశారు. ఇటీవ‌ల డిసెంబ‌రు 28న రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్ల‌తో ప్ర‌త్యేకంగా బిజినెస్ లీడ‌ర్స్ మీట్‌ను కూడా ఏర్పాటు చేశారు. మ‌హేశ్వ‌రం ప్రాజెక్టుకి లావోరా హిల్‌సైడ్ అనే పేరును పెట్టారు. సంస్థ మారింది స‌రే.. ప్రాజెక్టు పేరు మార్చారు స‌రే.. బాధితుల ప‌రిస్థితి ఏమిటి? ఇదే విష‌యాన్ని తెలుసుకునేందుకు రెజ్ న్యూస్ జంట ఎండీల్లో ఒక‌రైన మ‌ద్దిరాల రోసిరెడ్డిని సంప్ర‌దించింది. తాము కొంత‌మందికి సొమ్ము వెన‌క్కి ఇచ్చామ‌ని చెప్పారు. అయితే, ఎంత‌మందికి ఇచ్చారు? ఇంకెంత మందికి చెల్లించాల‌నే విష‌యంలో స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. మ‌రి, ఇలాంటి సంస్థ‌లు అమాయ‌క కొనుగోలుదారుల‌ను మోసం చేస్తూ ఉంటే.. ప్ర‌భుత్వం మొద్దు నిద్ర పోతూనే ఉంటుందా? రాష్ట్రంలో రౌడీలు, అల్ల‌రిమూక‌ల‌ను దారిలోకి తెచ్చిన ప్ర‌భుత్వం.. ఇలాంటి రియ‌ల్ మోస‌గాళ్ల ప‌ట్ల ఎందుకు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌ట్లేదు? ఈ మోస‌గాళ్ల బారిన ప‌డి తెలంగాణ ప్ర‌జానీకం ఇంకా మోస‌పోవాల్సిందేనా? ఇంకెంత కాలం ఇలా గోస ప‌డాలి??

This website uses cookies.