చోద్యం చూస్తున్న అధికారులు
చెరువులు, కుంటల వంటి నీటి వనరులను జాగ్రత్తగా పరిరక్షించుకోవాలనే అంశానికి చాలామంది బిల్డర్లు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. నిర్మాణ ప్రదేశంలోని వ్యర్థాలను సమీపంలోని చెరువులోకి మళ్లించి వాటిని కాలుష్య కాసారాలు చేస్తున్నారు. నీటి వనరులను సంరక్షించుకోవాలని, లేకుంటే వినాశనం తప్పదని పర్యావరణవేత్తలు ఎంతగా హెచ్చరిస్తున్నా.. కొంతమంది బిల్డర్లు, డెవలపర్ల చెవికి ఎక్కడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో ఇది నిత్యకృత్యంగా మారింది. నిర్మాణ వ్యర్థాలను, అక్కడ వచ్చే మురుగునీటిని చెరువులో కలిపేస్తున్నారు. నిబంధనల అతిక్రమణ జరుగుతున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బిల్డర్లపై ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదు. అసలు ఈ పని మాది కాదు అనే రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను కాలుష్యమయం నుంచి తప్పించే ఉద్దేశంతోనే ప్రభుత్వం జీవో 111 తీసుకొచ్చింది. అయితే, ఆ ఉద్దేశానికి తూట్లు పొడుస్తున్నారు. నాలాలపై ఇష్టారీతిన ఆక్రమణలు చేయడమే కాకుండా.. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు సాఫీగా వరదనీరు పారకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. నిర్మాణ వ్యర్థాలను యథేచ్చగా చెరువుల్లో కలిపేస్తున్నారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
This website uses cookies.