Categories: TOP STORIES

ఇంటి అలంకరణలో ఫర్నీచర్ కీలకం

లక్షలు.. కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొంటాం. ఆ ఇల్లు సౌకర్యవంతంగా ఉండాలంటే అందమైన ఫర్నీచర్ ఉండాల్సిందే. మరి మార్కెట్లో లభించే ఫర్నీచర్ లో ఏది మేలు? మన ఇంటిలో పొందికగా కుదిరే ఫర్నీచర్‌ను కొనాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సాధారణమైన ఫర్నీచర్ నుంచి బ్రాండెడ్ ఫర్నీచర్ లభిస్తున్న నేపథ్యంలో దాని నాణ్యతను తెలుసుకోవడమెలా?

ఎవరైనా సొంతింటిని ఎంతో కష్టపడి కట్టుకోవడమో లేదంటే కొనుక్కోవడమో చేస్తుంటారు. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇంటిని అందంగా అలంకరించుకోవాలని అనుకోవడం సర్వసాధారణం. మరి ఇంటి అలంకరణలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించేది ఫర్నీచర్. ప్రస్తుతం ఇంటికి తగ్గట్టు ఫర్నీచర్ ను ఎంపిక చేయడం కొంత కష్టమైన పనేనని చెప్పాలి. మారుతున్న పరిస్థితులతు అనుగునంగా ఇంటి కొనుగోలుకు వెచ్చించిన దాంట్లో 10 నుంచి 20 శాతం మేర ఫర్నీచర్ కొనుగోలుకు ఖర్చు చేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఫర్నీచర్ అంటే చూడటానికి చక్కగా ఉండటమే కాదు, ఇంట్లో సౌకర్యవంతంగా ఉండి, దీర్ఘకాలం మన్నేలా ఉండటం చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లక్షలు, కోట్లు ఖర్చు చేసి కొన్న సొంతింటిని అందంగా అలంకరించుకోవడంలో భాగంగా కొనుగోలు చేసే ఫర్నిచర్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటీరియర్ డిజైనర్స్ సూచిస్తున్నారు.

ఫర్నిచర్‌ షోరూంకు వెళ్లి మనకు నచ్చిన సోఫాలు, బెడ్‌లు ఆర్డర్‌ ఇస్తే, తీరా ఇంటికి వచ్చాక అవి సరిపోకపోవచ్చనేది గుర్తుంచుకోవాలి. అందుకే ఫర్నీచర్ షోరూంకు వెళ్లడానికి ముందే ఇంట్లో ఎక్కడెక్కడ సోఫాలు, బెడ్స్, టీపాయ్, డ్రెస్సింగ్ టేబుల్ వంటివి వస్తాయో.. ఆయా ప్రదేశాల కొలతలు తీసుకోవాలి. అప్పుడు షోరూంలో మనకు నచ్చిన ఫర్నిచర్‌ ఎంపిక చేసుకున్నాక ఒకసారి కొలతలు సైతం సరిచూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఇక ఫర్నీచర్ కొనుగోలు సమయంలో వాటి రంగులు నిశితంగా పరిశీలించాలి. మన ఇంటి గోడల రంగులను బట్టి ఫర్నీచర్ ను ఎంపిక చేసుకోవాలి. ఎవరి అభిరుచిని బట్టి వారు అదే రంగులో కలిసిపోయే వాటిని, లేదంటే ఆపోజిట్ రంగుల్లో ఉన్న ఫర్నీచర్ ను తీసుకోవచ్చు. రంగులతో పాటు ఫర్నీచర్ యొక్క నాణ్యతను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయమని మరిచిపోవద్దు.

ఫర్నీచర్ మార్కెట్లో ప్రస్తుతం సంప్రదాయ ఫర్నీచర్ తో పాటు వింటేజ్‌, ట్రెండీ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. వింటేజ్‌ ఫర్నీచర్ ధర కాస్త ఎక్కువే అయినా మన్నిక ఎక్కువగా ఉంటుంది. ఇక తేలికగా ఉండి, లేటెస్ట్ ఫ్యాషన్ గా చెప్పుకునే ట్రెండీ కలెక్షన్‌ కూడా అందంగా ఉంటాయి. ఫర్నీచర్ ను తయారు చేసేందుకు ఉపయోగించే వుడ్ ను బట్టి వీటి ధరలు ఉన్నాయి. ఇంట్లో ఎక్కువ స్పేస్ ను ఆక్రమించకుండా తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకునే ఫర్నిచర్‌ ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఇంట్లో ఎప్పటికీ కుదురుగా ఉండేలా కొనుగోలు చేసే బెడ్‌లు, సోఫాల కంటే విడిభాగాలు తీసుకొచ్చి జోడించే ఫర్నిచర్‌ వైపే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో పిల్లలు, పెద్దలు ఫర్నీచర్ కారణంగా గాయాల పాలవకుండా, కొనే సమయంలోనే ఫర్నిచర్‌ తయారీలో లోపాలు లేకుండా సరైన ఫినిషింగ్‌ ఉన్నవాటినే ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫర్నిచర్‌ షోరూంలు చాలా సందర్బాల్లో ఆఫర్లు కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటాయి. నాణ్యతతో కూడిన ఫర్నిచర్‌ అయితే ఇలాంటి ఆఫర్స్ లో కొనుక్కుంటే తక్కువ ధరలకే వస్తాయనీ, అయితే ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకుని కొనుగోలు చేయాలనీ సూచిస్తున్నారు.

This website uses cookies.