Categories: Celebrity Homes

మూడు అపార్ట్ మెంట్లు.. రూ.10.13 కోట్లు..

  • ముంబైలోని వెర్సోవాలో కొనుగోలు చేసిన గౌహర్ ఖాన్

నటి, మోడల్ గౌహర్ ఖాన్ ముంబై వెర్సోవాలో మూడు అపార్ట్ మెంట్లు కొనుగోలు చేశారు. శివ్ కుటిర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ అనే హౌసింగ్ సొసైటీలో ఉన్న ఈ ఫ్లాట్లను రూ.10.13 కోట్లు వచ్చించి కొన్నారు. మూడు అపార్ట్ మెంట్ల మొత్తం కార్పెట్ ప్రాంతం 3,497 చదరపు అడుగులు. ఆ భవనంలోని 14, 15వ అంతస్తులో ఉన్న మూడు అపార్ట్ మెంట్లలో రెండు గౌహర్ ఖాన్, ఆమె భర్త జైద్ దర్బార్ పేరిట రిజిస్టర్ అయ్యాయి.

వీటి కార్పెట్ ప్రాంతం 2,393 చదరపు అడుగులు కాగా, ధర రూ.7.33 కోట్లు. 1,104 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడో అపార్ట్ మెంట్ గౌహర్ ఖాన్ పేరు మీద మాత్రమే రిజిస్టర్ అయింది. దాని ధర రూ.2.80 కోట్లు. మూడు అపార్ట్ మెంట్లకు రూ.57.95 లక్షల స్టాంపు డ్యూటీ, రూ.60వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. మహిళా గృహ కొనుగోలుదారులకు మహారాష్ట్ర ప్రభుత్వం అందించే 1 శాతం స్టాంపు డ్యూటీ రాయితీ గౌహర్ ఖాన్ కు లభించింది. కాగా, మూడు అపార్ట్ మెంట్లు మూడు కార్ పార్కింగ్ స్థలాలతో ఉన్నాయి. మూడు అపార్ట్ మెంట్లను కిషోర్ పటేల్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు.

స్క్వేర్ యార్డ్స్ ప్రాజెక్ట్ డేటా ఇంటెలిజెన్స్ ప్రకారం ఫిబ్రవరి 2024-జనవరి 2025 మధ్య శివ్ కుటిర్లో రూ.14 కోట్ల స్థూల విలువ కలిగిన ఐదు లావాదేవీలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో సగటు పునఃవిక్రయ ఆస్తి ధర చదరపు అడుగుకు రూ.25,387గా ఉంది. కాగా, ముంబై పశ్చిమ శివారులలో ఉన్న వెర్సోవా కీలకమైన వాణిజ్య, వినోద కేంద్రాలకు నిలయంగా ఉంది. ఇది మెట్రోతో సహా రవాణా మౌలిక సదుపాయాలతో బాగా అనుసంధానం కలిగి ఉంది. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి బాలీవుడ్ తారలు సహా అనేక మంది నటులు వెర్సోవా, లోఖండ్‌వాలా, ఖార్, జుహు మరియు బాంద్రా వంటి ప్రాంతాలలో నివసిస్తున్నారు.

This website uses cookies.