గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. నగర శివార్లలోనూ మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యల్ని చేపడుతోంది.
హైదరాబాద్లోని అన్ని శివారు ప్రాంతాలకు మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. రహదారుల విస్తరణతో ప్రతి 10 నిమిషాలకు ఒక సిటీ బస్సు ఉండటం.. వీటికి తోడు ఎంఎంటీఎస్ రైలు సౌకర్యముంది. ఒకప్పుడు మేడ్చల్‌కు వెళ్లాలంటే ఎంతో దూరం అనిపించేది. తెల్లాపూర్‌కు వెళ్లాలంటే మహా కష్టం అయ్యేది. ఇదే పరిస్థితి ఘట్‌కేసర్, ఉందానగర్ ప్రాంతాలది. కానీ, ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలోనే అప్పట్లో చాలామంది నగర శివార్లలో ప్రజా రవాణా ఉన్న ప్రాంతాల్లో.. తక్కువ ధరలో భూములు, ఇంటి స్థలాల్ని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు వారి స్థిరాస్తుల ధరలు వృద్ధి చెందాయి. ప్రస్తుతం కూడా ఇలాంటి అవకాశాలు మార్కెట్లో ఉన్నాయని రియల్టర్లు చెబుతున్నారు.
ఎంఎంటీఎస్ మొదటి దశలో 45 కిలోమీటర్ల పరిధి కాగా.. రెండో దశ 95 కిలోమీటర్ల మేరకు పెరిగింది. ప్రస్తుతం ఓఆర్ఆర్ దాటి ఎంఎంటీఎస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. తాజాగా రీజనల్ రింగ్ రోడ్డు హద్దుగా హైదరాబాద్ నగర విస్తరణ జరుగుతోంది. ఒకప్పుడు నగరానికి పడమర వైపు లింగంపల్లి వరకే పరిమితమైన ఎంఎంటీఎస్ సేవలు తెల్లాపూర్ వరకు విస్తరించాయి. ఓఆర్‌ఆర్‌కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరు రైల్వే స్టేషన్‌కు, తర్వాత శంకరపల్లి, వికారాబాద్ వరకూ విస్తరించే హెచ్‌ఎండీఏ ప్రణాళికల్ని సిద్దం చేస్తోంది. ఇప్పుడున్న రెండు రైల్వే లైన్లకు అదనంగా ఎంఎంటీఎస్‌ల కోసం ప్రత్యేకంగా లైన్లు నిర్మించే ఆలోచనల్లో ప్రభుత్వం ఉంది. నగరానికి తూర్పు వైపు చర్లపల్లి తర్వాత ఘట్‌కేసర్ వరకూ ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. తర్వాత దశలో యాదాద్రి వరకూ నడపాలని సర్కార్ నిర్ణయించింది.
This website uses cookies.