Categories: TOP STORIES

జిల్లా క‌లెక్ట‌ర్ల వ‌ల్ల అనుమ‌తులు ఆల‌స్యం?

భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులు జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించ‌డం క‌రెక్టు కాద‌ని క్రెడాయ్‌ తెలంగాణ ఛైర్మన్ సీహెచ్‌ రామచంద్రా రెడ్డి తెలిపారు. క్రెడాయ్ తెలంగాణ నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఎంచుకున్న సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు అనుమ‌తి బాధ్య‌త‌ను అప్ప‌గించ‌డం వ‌ల్ల ఆల‌స్యం అవుతుంద‌న్నారు. ప్ర‌తి జిల్లాకో ప్ర‌త్యేక టీఎస్‌బీపాస్ వింగ్‌ను ఏర్పాటు చేస్తేనే అనుమ‌తులు సుల‌భంగా ల‌భిస్తాయ‌న్నారు. ధ‌ర‌ణిలో ఎదురౌతున్న స‌మ‌స్య‌ల్ని అతిత్వ‌రగా ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

మహమ్మారి కారణంగా పలు సవాళ్లు ఎదురైనప్పటికీ తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటుగా పలు జిల్లాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మంచి డిమాండ్ ఏర్ప‌డింద‌ని క్రెడాయ్ తెలంగాణ నూత‌న అధ్య‌క్షుడు ముర‌ళీకృష్ణారెడ్డి తెలిపారు. క్రెడాయ్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ అమ‌లు చేయ‌డంలో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని చెప్పారు. వినియోగ‌దారుల‌కు సంతృప్తిక‌ర‌మైన నిర్మాణాల్ని అందించేందుకు కృషి చేస్తామ‌న్నారు. భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు నైపుణ్యాభివృద్ధి మరియు సభ్యులకు శిక్షణ కార్యక్రమాల్ని నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రెరా ప్ర‌క్రియ‌కు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. క్రెడాయ్‌ తెలంగాణ‌ కార్యక్రమాల్ని విస్త‌రించ‌డంతో పాటు బిల్డర్ల మ‌ధ్య ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేస్తాన‌ని తెలిపారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని 33 జిల్లాల్లో 11 ఛాప్ట‌ర్లు ఉన్నాయ‌ని.. వీటి సంఖ్య‌ను ఇర‌వైకి పెంచేందుకు కృషి చేస్తాన‌ని వెల్ల‌డించారు.

కార్య‌ద‌ర్శి కె ఇంద్ర‌సేనారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పుడు పలు పరిశ్రమలైన టెక్స్‌టైల్స్‌, ఆటో – అనుబంధ సంస్థలు, ఫార్మా మరియు హెల్త్‌కేర్‌, ఐటీ, ఐటీఈఎస్‌, ఏవియేషన్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మొదలైన వాటిలో పెట్టుబడులను రాష్ట్ర వ్యాప్తంగా ఆకర్షిస్తుంద‌ని వివ‌రించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ‘ఒన్‌ డిస్ట్రిక్ట్‌, ఒన్‌ ప్రొడక్ట్‌’ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంద‌న్నారు. ప్రేమసాగర్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘ ద్వితీయ‌, తృతీయ శ్రేణీ ప‌ట్టణాల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించే కార్య‌క్ర‌మం ఆరంభ‌మైంద‌న్నారు. దీంతో వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ మొదలైన చోట్ల ఇళ్ల ధరలు బాగా పెరిగాయ‌న్నారు. ముఖ్యంగా ఇవే తరహా మౌలిక వసతులు కలిగిన ఇతర నగరాలతో పోల్చినప్పుడు ఈ ధరలు ఇవి తక్కువగా ఉండటంతో చాలా వరకూ కుటుంబాలు తమ ఆస్తులను కొనుగోలు చేయడాన్ని సౌకర్యవంతంగా భావిస్తున్నార’ని అన్నారు.

This website uses cookies.