poulomi avante poulomi avante

హైడ్రా పనితీరుతో ప్రశ్నార్ధకంగా.. జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏ

హైదరాబాద్ పేరు ఇప్పుడు హైడ్రాబాద్ గా మారిపోయింది. అవును గ్రేటర్ సిటీలో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా గురించే చర్చ జ‌రుగుతోంది. అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తుంటే ఓవైపు హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లాంటి ప్రభుత్వ అథారిటీల నుంచి అనుమతి పొంది, బ్యాంకు రుణాలు సైతం తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న వారికీ.. హైడ్రా నోటీసులు ఇస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు హైడ్రా ఏర్పాటు తరువాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధారిటీలు మనుగడలో ఉన్నాయా ఉంటే వాటికి అధికారాలు లేవా అన్ని సందేహాలు తలెత్తుతున్నాయి.

హైడ్రా ఏర్పాటు-పనితీరు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో చెరువుల బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అలియాస్ హైడ్రా చర్యల్ని చేపట్టింది. బఫర్ జోన్ లో భవనాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆక్రమణలను హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోను వదలదని హెచ్చరిస్తున్నారు. అందుకు అనుగుణంగానే.. ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. మొదటి విడతలో ఆక్రమణలను అడ్డుకోవడం, రెండో విడతలో వాటిపై చర్యలు, అనుమతుల నిరాకరణ ఉండేలా హైడ్రా చర్యలు చేపడుతోంది. మూడో దశలో చెరువుల పూడిక తీసి, వాన నీటిని మళ్లించే ప్రక్రియ చేపట్టేలా ప్రణాళికల్ని రచిస్తోంది.

హైడ్రా పై ప్రసంశలు-విమర్శలు

హైడ్రా పనితీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం కావడమే కాదు.. తెలంగాణలో మరిన్ని ప్రాంతాలకు హైడ్రాను విస్తరించాలన్న డిమాండ్ తో పాటు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయా ప్రభుత్వాలను కోరుతున్నారు ప్రజలు. ఇంతవరకు బాగానే ఉన్నా.. హైడ్రా దూకుడుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలను కూలిస్తే పరవాలేదు కానీ.. ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని అనుమతులు తీసుకున్న భవనాలను సైతం కూలుస్తుండటంతో హైడ్రాపై వ్యతిరేకత పెరుగుతోంది. పది పదిహేనేళ్ల క్రితం వేసిన లేఅవుట్ల‌లో.. సర్కార్ అనుమతితో.. బ్యాంకు రుణం తీసుకుని నిర్మించుకున్న ఇళ్లను హైడ్రా కూలగొట్టడంపై సామాన్యులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. అసలు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నిర్మణాలను కూల్చేందుకు హైడ్రాకున్న అధికారాలేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఇంటి నిర్మాణానికి కఠిన నిబంధనలు

తెలంగాణలో చిన్న పాటి ఇంటి నుంచి పెద్ద భవన నిర్మాణాలకు ఖచ్చితంగా సంబంధిత ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ అనుమ‌తి ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. లైసెన్సు కలిగిన ఆర్కిటెక్ట్ నుంచి అవసరమైన ప్లాన్‌ తో పాటు అవసరమైన పత్రాలన్నింటినీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే వారికి నెల రోజుల వ్యవధిలోపే సంబంధిత అనుమత‌నిస్తారు. దీంతో చేసిన వారికి 15 రోజుల్లోనే ఇంటి నిర్మాణానికి అవసరమైన అనుమతులన్నీ ఇచ్చేలా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్ లో భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు ఫీజు, భవనం నిర్మించాలని భావిస్తోన్న స్థలం ఫోటో, పహాణీ, సదరు స్థలానికి సంబంధించిన గెజిటెడ్‌ అధికారి సంతకం చేసిన సేల్‌ డీడ్‌ జిరాక్స్ కాపీ, లింక్‌ డాక్యుమెంట్‌ జిరాక్స్ కాపీ, లే-అవుట్‌ కాపీ, స్థలం తాజా మార్కెట్‌ విలువకు సంబందించిన పత్రం, ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్ తప్పనిసరి. అంతే కాదు ల్యాండ్‌ యూసేజ్ సర్టిఫికెట్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ సర్టిఫికెట్‌, గూగుల్‌ లోకేషన్‌ పింగ్‌, గుర్తింపు పత్రం, 100 రూపాయల విలువ కలిగిన స్టాంప్‌ పేపర్‌పై ఆఫిడవిట్‌ , 20 రూపాయల విలువ కలిగిన స్టాంప్‌ పేపర్‌ పై డిక్లరేషన్‌.. ఇలా సవా లక్ష ఫార్మాలిటీస్, డాక్యుమెంట్స్ కావాలి.

లోకేషన్‌ ప్లాన్‌, కాంటూర్‌ ప్లాన్‌, సైట్‌ ప్లాన్‌తో పాటు భవనంలోని ప్రతి అంతస్థుకు సంబంధించిన‌ సమగ్రమైన డ్రాయింగ్స్‌ ఉండాలి. అలాగే పార్కింగ్‌ ఫ్లోర్స్‌, టెర్రస్‌, బిల్డింగ్‌ ఎలివేషన్‌, క్రాస్‌ సెక్షన్‌, ల్యాంగిట్యూడనల్‌ సెక్షన్‌, రెయిన్‌ వాటర్‌ హర్వెస్టింగ్‌ పిట్‌, యజమాని, ఆర్కిటెక్ట్‌, స్ట్రక్చరల్ ఇంజనీర్ల సంతకాలతో కూడిన మార్టిగేజ్‌ ప్లాన్‌ కూడా ఉండాలి. భవన నిర్మాణ స్థలానికి చేరటానికి ప్రస్తుతం ఉన్న దారి వివరాలు కూడా ప్లానులో పొందుపరచాలి. స్థలం హద్దుల కొలతలు, ఆ స్థలం చుట్టుపక్కల ఉన్న భవనాల వివరాలు, భవన నిర్మాణ స్థలానికి ఇరుగు, పొరుగున ఉన్న వీధుల వివరాలు అన్నీ ప్లాన్‌లో క్లియర్‌గా సమర్పించాలి. ఇందులో ప్రధానంగా ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్థలం యొక్క స్వభావం, చుట్టు పక్కల చెరువులు ఉంటే ఖచ్చితంగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో లేదని నిర్ధారించే పత్రం సమర్పించాలి. అప్పుడే భవన నిర్మాణానికి అనుమతి మంజూరు చేస్తారు.

బ్యాంకు లోన్ అంత ఈజీ కాదు

ఇక ఇంటి నిర్మాణానికి సంబందించి అన్ని అనుమతులు సక్రమంగా ఉంటేనే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. అంతే కాకుండా లోన్ మంజూరు సమయంలో బ్యాంకులు సైతం అన్ని డాక్యుమెంట్స్ ను పరిశీలిస్తాయి. మరీ ముఖ్యంగా భవనం మరియు భూమి కోసం చెల్లించిన పన్నుల రసీదులు , రెవెన్యూ అధికారుల నుండి ఆస్తి స్థానానికి సంబంధించిన ధృవీకరించబడిన స్కెచ్ ఉండాల్సిందే. గత 30 సంవత్సరాల పాటు సదరు ఇంటి స్థలానికి సంబంధించిన‌ నాన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ తో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించి.. ప్రభుత్వ అథారిటీ నుంచి అనుమతి పత్రం ఉంటేనే.. బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. అంతే కాకుండా అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం 1976 ప్రకారం జారీ చేసే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను సైతం బ్యాంకులు కోరుతున్నాయి. వ్యవసాయ భూమిని నివాసానికి అనుగుణంగా మార్చితే సంబంధిత ప్రభుత్వ ఆర్డర్ కాపీ సైతం బ్యాంకు లోన్ కోసం కావాల్సిందే.

జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏ అధికారాల సంగతేంటి?

ఇంత కఠిన నియమ నిబంధనలను దాటుకుని, అధారిటీ అడిగిన అన్ని డాక్యుమెంట్స్ సమర్పించి, చట్టపరంగా అన్ని అనుమతులు పొంది ఇళ్లు కట్టుకున్నాక.. ఇప్పుడు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పేరు చెప్పి హఠాత్తుగా హైడ్రా ఇళ్లను కూల్చుతుండటంపై హైదరాబాద్ వాసుల్లో ఆందోళన వ్యక్తమ‌వుతోంది. అంటే అంతకు ముందు ఇంటి నిర్మాణం కోసం అనుమతినిచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలైన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లకు.. ఇప్పుడు అధికారం లేదా అని ప్రశ్నిస్తున్నారు. అనుమతులతో బ్యాంకు రుణం సైతం తీసుకుని ఈఎంఐలు కడుతుండగా.. ఇప్పుడు సడెన్ గై హైడ్రా వచ్చి అక్రమ కట్టడాలని కూలగొట్టడంపై చాలామందిలో ఆయోమయం నెలకొంది.

అంతా అయోమయం..

హైడ్రా నుంచి నోటీసులు అందుకున్న వారు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులను సంప్రదిస్తే వారు ఏం సమాధానం చెప్పలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, హైడ్రా అధికారాలు, పరిధిపై స్పష్టత కోరేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు సిద్దమవుతున్నారని సమాచారం. ఏదేమైనా హైడ్రా జెట్ స్పీడ్ దూకుడుకు మాత్రం బడాబాబులేమో గాని సామాన్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ‌ తప్పుడు మార్గాల్లో ఇంటి అనుమతులు ఇచ్చినట్టైతే సంబంధిత‌ అధికారులపై చర్యలు తీసుకోవాలి గాని.. పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న ఇంటిని కూల్చ‌డ‌మేమిట‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles