1) సర్, నాకు 300 గజాల స్థలం ఉంది. ఇందులో నేను జి ప్లస్ 2 అంతస్తులు వేసుకోవడానికి అనుమతినిస్తారు. కానీ, నా కుటుంబం కాస్త పెద్దది కాబట్టి.. టీడీఆర్ తీసుకుంటే, అదనపు అంతస్తు వేసుకోవచ్చా? ఇందుకోసం ఎలా అడుగు ముందుకేయాలి? టీడీఆర్ ఎవరి దగ్గర తీసుకోవాలి? ఇందుకు సంబంధించిన ప్రాసెస్ ఏమిటి? – చందన్ కుమార్, చందానగర్
సాధారణంగా మూడు వందల గజాల్లో స్టిల్ట్ ప్లస్ 3 అంతస్తుల్లో వ్యక్తిగత ఇల్లును కట్టుకోవచ్చు. అయితే, మీరు టీడీఆర్ తీసుకుని అధిక అంతస్తు వేసుకోవాలని భావిస్తున్నారు కాబట్టి.. మీ ప్లాటు ముందు ముప్పయ్ అడుగుల రోడ్డు ఉంటేనే మరో అంతస్తు వేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. జీహెచ్ఎంసీ వెబ్ సైటులోని టీడీఆర్ బ్యాంకు నుంచి మీరు టీడీఆర్ ను నేరుగా కొనుగోలు చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం https://tdr.ghmc.telangana.gov.in:8080 సైటును చూడండి.
2) అయ్యా, నేను హైదర్నగర్లోని గోపాల్ నగర్లో ఒక అపార్టుమెంట్లో ఫ్లాటు చూశాను. జీహెచ్ఎంసీ అనుమతి ఉందని అంటున్నారు. కానీ, పత్రం చూపించట్లేదు. రేటూ రీజినబుల్గానే చెబుతున్నారు. కాకపోతే, గోపాల్ నగర్లో అపార్టుమెంట్లు కట్టుకునేందుకు అనుమతి ఉన్నదా? ఈ అపార్టుమెంటుకు పర్మిషన్ వచ్చిందా? లేదా? అనే విషయాన్ని ఎలా కనుగొనాలి? – రాజశేఖర్, కేపీహెచ్బీ కాలనీ
ఎల్ఆర్ఎస్ ఛార్జీలను తీసుకుని గోపాల్ నగర్లో ఇంటి అనుమతిని మంజూరు చేస్తున్నాం. అయితే, అనుమతి లభ్యత గురించి తెలుసుకునేందుకు ఈ వెబ్ సైటులో (Public Search (telangana.gov.in) క్లిక్ చేస్తే సరిపోతుంది.
3) సర్, వనస్థలిపురంలో 267 గజాల ప్లాటు ఉంది. అందులో జి ప్లస్ 1 అంతస్తుల ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. అనుమతి కోసం ఎవర్ని సంప్రదించాలి? సాధారణంగా దీనికెంత సమయం పడుతుంది? త్వరగా పర్మిషన్ రావాలంటే ఎవరిని సంప్రదించాలి? అనుమతి కోసం సుమారు ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది? – లక్ష్మణ్, ఎల్బీనగర్
మీరు ఇంటి అనుమతి కోసం ఆన్ లైన్ లో (https://tsbpass.telangana.gov.in/) దరఖాస్తు చేస్తే సరిపోతుంది. మీ ప్లాట్ సైజు ప్రకారం ఇంటి అనుమతిని తక్షణమే పొందవచ్చు. ఇందుకోసం మీరు మా కార్యాలయానికి పనిగట్టుకుని రానక్కర్లేదు. ఇంటికి సంబంధించిన నిర్ణీత పత్రాల్ని ఆన్ లైన్లో సమర్పించి.. సిస్టమ్ జనరేట్ చేసే రుసుమును చెల్లిస్తే తక్షణమే అనుమతి లభిస్తుంది. ఆ తర్వాత దరఖాస్తును పూర్తిగా వెరిఫై చేసి మేం కన్ఫర్మేషన్ ఇస్తాం.
4) సార్, నేను మియాపూర్లోని న్యూ కాలనీలో ఉంటాను. మా పక్కనే ఒక డెవలపర్ అపార్టుమెంట్ కడుతున్నాడు. ఉదయం పూట బ్లాస్టింగ్ చేస్తూ, రాత్రి పూట టిప్పర్లలో మట్టి తోలుతూ.. 24 గంటలూ పని చేస్తూ మాకు నిద్రలేకుండా చేస్తున్నాడు. బ్లాస్టింగ్ చేస్తుంటే మా ఇంట్లోని సామాన్లు ఎగిరి కింద పడుతున్నాయి. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. అసలు బ్లాస్టింగ్కి ఎవరు అనుమతినిస్తారు? ఈ సమస్య నుంచి మాకు పరిష్కారమే లేదా? ఇలా ఇతను 24 గంటలూ పనులు చేయాల్సిందేనా? – రామరాజు, మియాపూర్
సైట్లలో బ్లాస్టింగులకు పోలీసు డిపార్టుమెంట్ అనుమతిని మంజూరు చేస్తుంది. పోలీసులిచ్చే అనుమతికి లోబడి డెవలపర్లు బ్లాస్టింగులను చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా పోలీసు విభాగానికి ఫిర్యాదు చేస్తే తగిన చర్యల్ని తీసుకుంటారు.
5) సార్, నాకు 500 గజాల స్థలం ఉంది. ప్లాటు ముందు 40 అడుగుల రోడ్డు ఉంది. ఈ ప్లాటులో నాకు ఎన్ని అంతస్తుల దాకా అనుమతినిస్తారు? నిబంధనల ప్రకారం, ఎంత వరకూ డీవీయేషన్ను మీరు అంగీకరించే అవకాశం ఉంటుందా? – రామేశ్వర్రావు, మాదాపూర్.
మీరు పొందుపర్చిన వివరాల ప్రకారం.. మీకు స్టిల్ట్ ప్లస్ నాలుగు అంతస్తుల్లో ఇల్లు కట్టేందుకు అనుమతి లభిస్తుంది. ఫలానా శాతం డీవియేషన్ను అనుమతించాలనే స్పష్టమైన నిబంధనలేం లేవు. కాకపోతే, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ను మంజూరు చేసేటప్పుడు ముందు భాగంలో కాకుండా.. మిగతా వైపు సెట్ బ్యాక్స్ లో పది శాతం డీవీయేషన్ ఉన్నా పరిగణలోకి తీసుకుంటాం. అయితే, ఇది కూడా నిర్ణీత పరిమితులకు లోబడి ఉంటేనే అనుమతినిస్తాం.
నోట్: ఇంటి అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, టీడీఆర్, అపార్టుమెంట్లు, లేఅవుట్లు.. ఇలా జీహెచ్ఎంసీ పరిధిలో మీకు ఏ అంశాలపై సందేహాలున్నా.. మాకు రాయండి. జీహెచ్ఎంసీ కమిషనర్ మీకు సమాధానాలిస్తారు. మీరు ప్రశ్నలు పంపాల్సిన మా మెయిల్ ఐడీ: regpaper21@gmail.com
This website uses cookies.