- ట్రిపుల్ వన్ జీవోను తొలగిస్తే వినాశనమే!
- సుప్రీం కోర్టు ప్రశంసించిన నివేదికను పట్టించుకోరా?
- ఎక్స్‌పర్ట్ కమిటీల రిపోర్టును పక్కన పెట్టారా?
- ఆదరాబాదరాగా ఎందుకు 69 జీవోను విడుదల చేశారు?
- నిపుణుల్ని కొత్త కమిటీలో ఎందుకు చేర్చలేదు?
- ప్రభుత్వ నిర్ణయంపై పర్యావరణవేత్తలు సీరియస్
ముంబైలో మీథి (మాహిమ్) నదిని అక్కడి పాలకులు నిర్లక్ష్యం చేశారు. మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు మరియు మునిసిపల్ వ్యర్థాల వల్ల అది కలుషితమైంది. పాత్రలు, జంతువులు మరియు నూనె డ్రమ్ములు కడగడం వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతాయి. ఈ నది ఏళ్ల తరబడి ఆక్రమణలకు గురై ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్‌తో నిండిపోయింది. ముంబై వరదల వల్ల అక్కడి ఇళ్లు జలమయం అవుతుంటాయి.
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం రెండో రన్‌వేను అడయార్ నదిపై నిర్మించారు. విమానాశ్రయంలో ఎక్కువ భాగం నదీ ప్రవాహ ప్రాంతాలలో నిర్మించడం వల్ల.. 2015 చెన్నై వరదల సమయంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ చెరువు ప్రాంతంలో అక్రమంగా ఇళ్లు, భవనాల్ని నిర్మించారు. వరదల సమయంలో అవన్నీ నీటమునిగాయి. ఇది మనుష్యుల తప్పిదమని పర్యావరణవేత్తలు ఆనాడే హెచ్చరించారు. చరిత్రను తిరగేస్తే.. చెరువులు, నదుల దురాక్రమణ గురైన ప్రాంతాలకు వరదల సమయంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రకృతికి అడ్డుగా వెళ్లి ఎవరూ వ్యవహరించినా.. ఆ తర్వాత తీవ్ర మూల్యం చెల్లించుకోవాలి. కాబట్టి, హైదరాబాద్లో ఇలాంటి వికృతమైన అనుభవాలు ఎదురు కాకూడదంటే.. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్ని పరిరక్షించుకోవాలని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. జంట జలాశయాల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, కాలుష్యం అధికమై.. నగరానికే పెను ప్రమాదం ఏర్పడే అవకాశముందని చెబుతున్నారు. మూసీ ఉద్భవించిన ప్రాంతాన్ని గమనిస్తే.. జీవ వైవిధ్యం, శిలా వైవిధ్యం, వాతావరణ వైవిధ్యమున్న ప్రాంతమని వివరించారు. అక్కడ కొన్ని వేల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అనంతగిరి నుంచి జంట జలాశయాల దాకా సహజసిద్ధంగా నీరు పారుతుంది. వర్షం నీరు క్యాప్చర్ అయ్యి.. భూమిలోకి ఇంకిపోవడమనేది హైదరాబాద్‌లోనే సాధ్యమైంది. మనకు ప్రకృతి అందించిన గొప్ప వరం. దీన్ని పరిరక్షణ గురించి ప్రభుత్వం ఇప్పటివరకూ ఎక్కడా చర్చించలేదు. 111 జీవో తొలగించాక చర్చిస్తామని చెప్పడం దారుణమైన విషయం. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ప్రభుత్వం 111 జీవోను తొలగించిందని నగర ప్రజలు అంటున్నారు.
ఆ మూడు నివేదికలను
సుప్రీం కోర్టు ప్రశంసించింది!
ట్రిపుల్ వన్ జీవో ఆషామాషీగా రూపొందించలేదని పర్యావరణవేత్తలు అంటున్నారు. నిజాం కాలంలో.. హైదరాబాద్ వరదలు సంభవించినప్పుడు ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లకూడదనే ఉద్దేశ్యంతో.. ఈసా, మూసీ నదిలపై రెండు ఆనకట్టల్ని అప్పటి నిజాం నవాబు నిర్మించారు. వాటికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లుగా పేరు పెట్టారు. గొప్ప విషయం ఏమిటంటే.. వీటి వల్ల వరద నీరు నిలుస్తుంది. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. నగరం మునగకుండా ఉంటుంది. వీటిని నిర్మించి వందేళ్లు దాటడంతో భద్రత గురించి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది. 2021లో వాటర్ బోర్డు విడుదల చేసిన నివేదికలో.. వరద నీరు ఎక్కువగా వస్తుండటం వల్ల జంట జలాశయాల భద్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఆకాలంలోనే నిజాం ఫర్మానా కూడా ఉండేదని నిపుణులు చెబుతున్నారు. ‘జంట జలాశయాలకు సంబంధించి 1985లో అప్పటి ప్రభుత్వం జీవో నెం. 50ని విడుదల చేసింది. ఆ తర్వాత 1994లో.. జలాశయాలు, వాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్ని అధ్యయనం చేసేందుకై.. అప్పటి వాటర్ బోర్డు ఎక్స్‌పర్ట్ కమిటీని నియమించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే 1994లో 192 జీవో విడుదలైంది. ఆ తర్వాత 1996లో నిపుణుల కమిటీ రెండో నివేదికనూ అందజేసింది. దాన్ని ఆధారంగా 111 జీవోను 1996లో అమల్లోకి తెచ్చారు. అయితే, 2000లో సురానా ఆయిల్ ఇండస్ట్రీస్ అండ్ డిరైటీవ్స్ వల్ల 111 జీవో సమస్య సుప్రీం కోర్టుకి చేరింది. అప్పుడు సుప్రీం కోర్టు ఏం చేసిందంటే.. ముంబైకి చెందిన డాక్టర్ బౌమిక్, ఎన్జీఆర్ఐ ఎక్స్‌పర్ట్ కమిటీ, నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ప్యానెల్ నుంచి నివేదికల్ని తీసుకుని.. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రికాషన్ అండ్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ కింద జీవో 111 తొలగించకూడదని 2000లో తీర్పునిచ్చింద’ని వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ తెలంగాణ ప్రెసిడెంట్ డా. లుబ్నా సర్వత్ వివరించారు. ఆ మూడు నివేదికలను అప్పట్లో సుప్రీం కోర్టు ప్రశంసించడం గమనార్హం. ఈ మొత్తం ఐదు నివేదికలను పక్కన పెట్టేసి.. తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేయడం పట్ల వ్యతిరేకత ఏర్పడుతోంది.
పర్యావరణవేత్తల్ని చేర్చాలి!
వాస్తవానికి, 2016లో ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కలిసి ఎంపవర్డ్ కమిటీని ఏర్పాటు చేశామని ఎన్జీటీలో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. కానీ, అది 2018లో నివేదికను ఇవ్వలేదు. ఆతర్వాత మళ్లీ కమిటీని కొత్తగా ఏర్పాటు చేశారు. ఆ విషయాన్ని కోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదని పర్యావరణవేత్తలు తప్పు పడుతున్నారు. ఇటీవల కాలంలో నాలుగు వారాల్లోపు కమిటీ రిపోర్టు అందజేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి చెప్పినా వినిపించుకోలేదు. ఆరేళ్ల నుంచి ఆ కమిటీ ఏం పని చేసింది? ఎలాంటి నివేదిక ఇచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ, హఠాత్తుగా ఈమధ్య 111 జీవోను ఎత్తివేయాలని మంత్రిమండలి సిఫార్లు చేసిందని చెబుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 111 జీవో వల్ల జంట జలాశయాలకు బ్లాంకెంట్ ప్రొటెక్షన్ ఉండేది. దాన్ని జీవో 69తో తొలగించినట్లు అయ్యింది. పైగా, కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అధికారులంతా కూర్చుని చర్చిస్తే.. ప్రభుత్వం చెప్పినట్లే వినాల్సి వస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇందులో పర్యావరణవేత్తలు, విషయ నిపుణుల్ని చేర్చాలి.
కొత్త జీవోలో స్పష్టత ఎక్కడా?
జీవో నెం. 59లో క్యాచ్‌మెంట్ ఏరియా, సోర్స్ ఆఫ్ వాటర్ మేనేజ్‌మెంట్ అండ్ శానిటేషన్ గురించి స్పష్టత లేదని నిపుణులు చెబుతున్నారు. జీవోలు చేసుకోవచ్చు. తీసుకోవచ్చు. కానీ, ఇలాంటివన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. జంట జలాశయాల పరివాహక ప్రాంతాల్లో పరిశ్రమల నుంచి వెదజల్లే కాలుష్యాన్ని ఇప్పటికైనా తగ్గించాలి. ఎస్టీపీలు పెడతామని అంటున్నారు? ఇంతవరకూ ఒక్క ఎస్టీపీ అయినా నగరంలో విజయవంతంగా పని చేస్తుందా? 1996 నుంచి ఈ రోజు దాకా.. హుస్సేన్ సాగర్‌ను పరిశుభ్రం చేస్తామని అంటున్నారు. కానీ, ఇంతవరకూ అది జరిగిందా? ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. వాటర్ నాణ్యతను పెంచామని చెప్పేందుకు రికార్డులు లేవు. వరదల గురించి ఎక్కడా పేర్కొనలేదని పర్యావరణవేత్తలు అంటున్నారు.
జీవోలు తగులబెట్టారా?
జీవో 192, జీవో 50, దాని ముందున్న నైజాం ఫర్మానాల గురించి లేవు. 2014లో అన్ని జీవోలు, డాక్యుమెంట్లను తగులబెట్టారని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. మరి, అది ఎంతవరకూ కరెక్టో తెలియదు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 69కి క్రెడిబిలిటీ లేదు. ఎందుకంటే, అందులో జీవో 50 గురించి కానీ జీవో 192 గురించి కానీ ఎక్కడా పేర్కొనలేదు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ గురించి రిఫర్ చేయలేదని నిపుణులు అంటున్నారు.