- ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేస్తే జరిగేది ఇదే
- సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి స్పష్టీకరణ
హైదరాబాద్ లో ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేస్తే నగరం పాయిఖానా అయిపోవడం ఖాయమని సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు హైదరాబాద్ జిందాబాద్ అన్నారని.. ఇప్పుడు ఆ జీవో ఎత్తివేసినందున హైదరాబాద్ ముర్దాబాద్ అంటారని స్పష్టం చేశారు. హైదరాబాద్ అంటే ఆహ్లాదకరమైన వాతావరణానికి, ఆరోగ్యకరమైన వాతావరణానికి చిరునామా అని.. జీవో ఎత్తివేస్తే అదంతా పోతుందని పేర్కొన్నారు. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేసిన తర్వాత రెండు పెద్ద పాయిఖానాలు వస్తాయని.. వాటిలో ఏడు కోట్ల ఘనపుటడుగుల మురికి నీరు ఉంటుందని హెచ్చరించారు. అలా హైదరాబాద్ పాయిఖానా అయిపోతే ఇక్కడ ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. తొలుత ఐటీ కంపెనీలు వెళ్లిపోతాయని.. దాదాపు పది లక్షల మంది వెళ్లిపోతారని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ కూడా పడిపోతుందని స్పష్టంచేశారు. అందువల్లే రియల్ ఎస్టేట్ వారిలో సగం మందికి పైగా దీనిని వ్యతిరేకిస్తున్నారని యాదగిరి పేర్కొన్నారు.
జీవో ఎత్తివేత వెనుక కుట్ర దాగి ఉందని, సీఎం కేసీఆర్ రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. దీని వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా ఉందని, అధికార పార్టీకి అనుకూలమైన వారంతా కలిసి దీనిని కబ్జా చేయాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. పేదలు ఉండగా ట్రిపుల్ వన్ జీవో అన్నారని.. వారిని తరిమేసిన తర్వాత, తక్కువకు అమ్ముకుని వెళ్లిపోయేలా చేశారని.. వాటిని రియల్ ఎస్టేట్ మాఫియా కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. అయితే, వీటికి ఎలాంటి అనుమతులూ రావని.. ఈలోగానే వాటిని అమ్మేసుకుంటారని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అన్ని పార్టీలూ ఒక్కటేనని, అందుకే దీనిపై ఎవరూ నోరు మెదపడంలేదని ఆయన విమర్శించారు.