12.5 ఎకరాల స్థలం కొన్న దిగ్గజ రియల్టీ సంస్థ
ముంబైకి చెందిన ప్రముఖ రియల్టీ సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ లో అడుగు పెట్టింది. మన భాగ్యనగరంలో ఓ మెగా ప్రాజెక్టు లాంచ్ చేయడం కోసం రాజేంద్రనగర్ లో 12.5 ఎకరాల స్థలం కొనుగోలు చేసింది. ఈ స్థలం విలువ దాదాపు రూ.350 కోట్లు ఉంటుందని సమాచారం. ఇందులో ఓ మెగా హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టాలని గోద్రేజ్ ప్రాపర్టీస్ నిర్ణయించింది. ఆధునిక సౌకర్యాలు, అత్యాధునిక డిజైన్, అత్యంత నాణ్యతతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తామని తెలిపింది. నాణ్యమైన జీవనం కోరుకునేవారి ఆకాంక్షలు నెరవేర్చేలా తమ ప్రాజెక్టు ఉంటుందని పేర్కొంది. 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రీమియం రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లు నిర్మించనున్నట్టు ప్రకటించింది. దేశంలో అతిపెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లలో హైదరాబాద్ ఒకటని గోద్రేజ్ ప్రాపర్టీస్ సీఈఓ గౌరవ్ పాండే పేర్కొన్నారు. అలాంటి నగరంలోకి తాము ప్రవేశిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దేశంలోని కీలక మార్కెట్లలో తమ పోర్టు ఫోలియోనే ఈ డీల్ బలపరుస్తుందని నమ్ముతున్నట్టు చెప్పారు.