రెరా రిజిస్ట్రేషన్ నంబర్, క్యూఆర్ కోడ్ లేకుండా ప్రచురితమవుతున్న ప్రటకటనలను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని వినియోగించనున్నట్టు మహా రెరా తెలిపింది. ఈ మేరకు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్ సీఐ)తో కలసి పనిచేయనుంది. ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏఎస్ సీఐ తో మహా రెరా ఒప్పందం కుదరుర్చుకుంది. దీని ప్రకారం ఎవరైనా మహా రెరా రిజిస్ట్రేషన్ నంబర్, క్యూఆర్ కోడ్ లేకుండా ప్రకటనలు ఇస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాటిని గుర్తిస్తారు. అనంతరం మహా రెరా దృష్టికి తీసుకెళ్తారు. ఇందుకోసం ఓ కోర్ గ్రూప్ ఏర్పాటు చేస్తారు. నిబంధనల ప్రకారం మహా రెరాలో ప్రాజెక్టు రిజిస్టర్ చేసిన తర్వాతే డెవలపర్లు వాణిజ్య ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయా ప్రకటనలపై క్యూఆర్ కోడ్ ను కూడా తప్పనిసరి చేశారు. ఇవి రెండూ లేకుండా ఎవరైనా ప్రకటనలు ఇస్తే.. ఏఐతో వాటిని గుర్తించి సదరు డెవలపర్ పై రెరా చర్యలు తీసుకుంటుంది. రెరా చట్టం ప్రకారం 500 చదరపు మీటర్లు లేదా 8 ఫ్లాట్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఏ ప్రాజెక్టునైనా రెరాలో తప్పనిసరిగా నమోదు చేయాలి.