- ఖమ్మం పోలేపల్లిలోని జలాలా టౌన్ షిప్ ఫ్లాట్లు కూడా
- కాంట్రాక్టర్లు, బిల్డర్లకు మాత్రమే అవకాశం
- 2,246 ఫ్లాట్ల విక్రయం ద్వారా రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భూముల వేలం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా ఫ్లాట్లను సైతం వేలం వేయాలని నిర్ణయించింది. నాగోల్ సమీపంలోని బండ్లగూడలో ఉన్న రాజీవ్ స్వగృహ సహభావన టౌన్ షిప్, ఖమ్మం జిల్లా పోలేపల్లిలోని జలాలా టౌన్ షిప్ లోని మొత్తం 2,246 ఫ్లాట్లను విక్రయించనుంది. ఈనెల 24న ఈ వేలం ప్రక్రియను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథార్టీ (హెచ్ ఎండీఏ) నిర్వహించనుంది.
ఈ ఫ్లాట్ల అమ్మకం ద్వారా దాదాపు రూ.1000 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే, వీటిని వ్యక్తులకు కాకుండా కాంట్రాక్టర్లు, బిల్డర్స్ కు అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్లాక్ లేదా క్లస్టర్ వారీగా బిడ్లు ఆహ్వానించి వీటిని విక్రయిస్తుంది. అనంతరం ఆయా కాంట్రాక్టర్లు వాటిని తమకు కావాల్సిన విధంగా మార్చుకుని అమ్ముకోవచ్చు.
వాస్తవానికి బండ్లగూడ, పోచారం లోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను 2016లో వేలం వేశారు. అయితే, చాలా ఫ్లాట్లు అమ్ముడుపోలేదు. ఈ నేపథ్యంలో బండ్లగూడలోని ఫ్లాట్లను 15 బ్లాకులుగా, ఖమ్మం పోలేపల్లిలోని ఫ్లాటలను 8 బ్లాకులుగా విభజించి విక్రయించాలని నిర్ణయించారు. ఆయా ప్రాజెక్టుల్లో రోడ్ల వంటి కనీస వసతి సౌకర్యాలను హెచ్ఎండీఏ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిచేయనుంది. వాటిలో 1, 2, 3 బీహెచ్ కే ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి.
బండ్లగూడలోని ఫ్లాట్ కనీస ధర చదరపు అడుగుకి రూ.2,200 నుంచి రూ.2,700 మధ్య, ఖమ్మం పోలేపల్లిలో ఫ్లాట్ల కనీస ధర రూ.1500 నుంచి రూ.2వేల మధ్య నిర్ణయించారు. వేలానికి సంబంధించి ప్రీబిడ్ సమావేశం మార్చి 4, మార్చి 14వ తేదీల్లో జరగనుంది. ఇక వేలంలో పాల్గొనేవారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మార్చి 22 చివరి తేదీ. బండ్లగూడ ఫ్లాట్లకు మార్చి 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు, ఖమ్మం ఫ్లాట్లకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ వేలం నిర్వహిస్తారు.