తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. గతకొంతకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టి సారించింది. ధరణిలో అనేక లోపాలున్నాయని ముందే గుర్తించిన కాంగ్రెస్ పార్టీ.. సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల సీఎం రెవెన్యూ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో.. ధరణి పోర్టల్ తీరుపై అనేక సందేహాలు వ్యక్తం చేశారు. ధరణిలో రికార్డులకు ఉన్న భద్రత ఎంత? అని రెవెన్యూ అధికారుల్ని ప్రశ్నించారని తెలిసింది. ఏదీఏమైనా ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు తొలి అడుగు పడినందుకు ప్రజలెంతో సంతోషిస్తున్నారు.
హెచ్ఎండీఏకు జాయింట్ కమిషనర్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలి కాటాను నియమించగా, ఆమె శుక్రవారం బాధ్యతల్ని స్వీకరించారు. ప్రస్తుతం హెచ్ఎండీఏకు తాత్కాలిక కమిషనర్‌గా అరవింద్ కుమార్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. హెచ్ఎండీఏకు పూర్తి స్థాయి కమిషనర్‌ను ఏర్పాటు చేయాలని రియల్ ఎస్టేట్ గత కొంతకాలం నుంచి కోరుతున్న విషయం తెలిసిందే. ఆమ్రపాలి కాటా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బాధ్యతల్ని చేపట్టారు.
వంద ఎకరాల్లో హైకోర్టు సముదాయాలు..
రాజేంద్రనగర్‌లో వంద ఎకరాల్లో కొత్త హై కోర్టు భవనాన్ని ఏర్పాటు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల బుద్వేల్, కిస్మత్‌పూర్, బండ్లగూడ వంటి ప్రాంతాల్లో స్థిరాస్తుల లావాదేవీలు పెరుగుతాయి. ముచ్చర్లలో ఫార్మా సిటీ బదులు గ్రీన్ సిటీని నిర్మిస్తామన్న ప్రతిపాదనకు ప్రజల్నుంచి మిశ్రమైన స్పందన వస్తోంది. ఫార్మా కంపెనీలు రాకపోతే కొత్త ఉద్యోగావకాశాలు ఎలా లభిస్తాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాకపోతే, గ్రీన్ సిటీ వల్ల అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలకు గిరాకీ పెరిగే ఆస్కారముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.