రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్
- 8.5 ఏళ్లలో ఆకర్షించిన పెట్టుబడులు: 3.31 లక్షల కోట్లు
- 140 శాతం వృద్ధి చెందిన ఐటీ నియామకాలు
- పట్టణాభివృద్దిలో తెలంగాణకు అనేక అవార్డులు
- 7.7 శాతం పెరిగిన గ్రీన్ కవర్
- ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్‌గా నగరానికి గుర్తింపు
- రాష్ట్ర ఆదాయం 62000 కోట్ల నుంచి
రూ. 1.84 లక్షలకు పెరుగుదల - బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వంపై ప్రశంసలు
కింగ్ జాన్సన్ కొయ్యడ : తెలంగాణ నగరాలు, పట్టణాల్లో తాగునీటి సమస్యలు తొలగిపోయాయి. విద్యుత్తు కోతలు పెద్దగా లేవు. ఉద్యోగాలు పెరిగాయి. ఐటీ రంగం అభివృద్ధి చెందింది. పట్టణాల్లో పారిశుద్ధ్య ప్రమాణాలు రెట్టింపయ్యాయి. పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమం ఒక యజ్ఞంలా జరుగుతోంది. రాష్ట్రం ఆర్థికంగా గణనీయంగా వృద్ధి చెందుతోంది. మొత్తానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి చేసిన బడ్జెట్ ప్రసంగంలో ఆమె తెలంగాణ రాష్ట్రం పురోగతి చెందుతుందంటూ పలు అంశాల్ని ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు ఏమిటంటే..
తెలంగాణ పట్టణాల్లో పారిశుద్ధ్య ప్రమాణాలు పెరిగాయి. పురపాలక సంస్థల పనితీరు మెరుగపడింది. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం, పెద్ద సంఖ్యలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, శ్మశానాలను ఆధునిక వసతులు కలిగిన వైకుంఠధామాలుగా మార్చడం వంటి అనేక మౌలిక వసతుల్ని ప్రభుత్వం కల్పించింది. ఉత్తమ పనితీరు గల నగరాలు, పట్టణాల విభాగంలో కేంద్రం అనేక అవార్డుల్ని ఇటీవల ప్రకటించింది. 26 అవార్డులతో తెలంగాణ పనితీరును అత్యుత్తమంగా కనబర్చింది. దక్షిణ రాష్ట్రాలకు ఇచ్చిన 75 శాతం అవార్డులను తెలంగాణ కైవసం చేసుకుంది.