- ఫిబ్రవరిలో మహారాష్ట్రలో భారీగా రిజిస్ట్రేషన్లు
- ఒక్క నెలలోనే 11,833 రిజిస్ట్రేషన్లు.. రూ.869 కోట్ల ఆదాయం
రిజిస్ట్రేషన్ల పరంగా మహారాష్ట్ర ఫిబ్రవరిలోరికార్డు సృష్టించింది. గత 12 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ ఒక్క నెలలోనే రాష్ట్రంలో ఏకంగా 11,833 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు స్టాంపు డ్యూటీ రూపంలో రూ.869 కోట్ల ఆదాయం వచ్చింది. గత 12 ఏళ్లలో రిజిస్ట్రేషన్ల పరంగా ఇదే అత్యధికం కావడం గమనార్హం. కాగా, 2024 జనవరిలో 10,967 ఇళ్ల రిజిస్ట్రేషన్ జరగ్గా ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ రూపంలో రూ.760 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంటే కొత్త సంవత్సరం ప్రారంభం కంటే ఫిబ్రవరిలోనే ఎక్కువ ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలుస్తోంది.
సాధారణంగా కొత్త సంవత్సరం లేదా సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, దంతేరాస్ తదితర పండుగల సందర్భంగా బిల్డర్లు, ఇతర వ్యాపారులు రాయితీలు ప్రకటిస్తారు. ముఖ్యంగా బిల్డర్లు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోళ్లపై అనేక రాయితీలు ఇస్తారు. నిర్దేశిత తేదీలోపు ఫ్లాట్ బుక్ చేసుకుంటే స్టాంప్ డ్యూటీ లేదా జీఎస్టీ చెల్లించనవసరం లేదని, లేదా కారు, బైక్, బంగారు కాయిన్ కానుకగా ఇస్తామని ప్రచారం చేస్తుంటారు. దీంతో కొనుగోలుదారులు కూడా వీటికి ఆకర్షితులైన ఇళ్లు, ఫ్లాట్లు బుక్ చేసుకుంటారు. అయితే, ఫిబ్రవరిలో ఎలాంటి పండుగలు లేకున్నా.. రికార్డులో స్థాయిలో ఇళ్లు కొనుగోలు చేయడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్లు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటన్నారు.
మహారాష్ట్రలో గత 12 ఏళ్లలో ఫిబ్రవరిలో జరిగిన ఇళ్ల విక్రయాలు ఇలా..
సంవత్సరం ఇళ్ల విక్రయం
2013 4,840
2014 4,843
2015 4,986
2016 5,208
2017 3,664
2018 6,631
2019 5,230
2020 5,927
2021 10,172
2022 10,379
2023 9,684
2024 11,833