కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యంగా
హరిత భవనాలకు ప్రాధాన్యం
దేశంలో హరిత భవనాల నిర్మాణాల్లో పెరుగుదల నమోదవుతోంది. కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాన్ని సాధించేందుకు రియల్ రంగంలో గ్రీన్ బిల్డింగ్స్ ను ప్రోత్సహిస్తున్నారు. మహమ్మారి సమయంలో కొన్నాళ్లు విరామం తీసుకున్న నిర్మాణ రంగం అనంతరం బాగా పుంజుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో భారతదేశ నిర్మాణరంగం ప్రపంచంలోనే మూడో వ్యవస్థగా అవతరించే దిశగా సాగుతోంది. ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్ లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
దేశంలో 2030 నాటికి నిర్మించాల్సిన ఇళ్లు చాలానే ఉన్న నేపథ్యంలో భారత నిర్మాణ రంగం మూడో స్థానానికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు భవన నిర్మాణ రంగం అనేది సంప్రదాయబద్దంగా వనరులు ఎక్కువగా వినియోగించే వ్యవస్థ. మైనింగ్, రవాణా, నిర్మాణ సామగ్రి వంటి కాలుష్య కార్యకలాపాలు కూడా ఎక్కువ. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 40 శాతం కర్బన ఉద్గారాలు నిర్మాణరంగం నుంచే వెలువడుతున్నాయి. మనదేశంలో కర్బన ఉద్గారాల వాటా 25 శాతం ఉండగా.. వనరుల వెలికితీతలో వచ్చే కర్బన ఉద్గారాల రేటు ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు అధికంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం 2019లో ఎకరాకు ఇది 1580 టన్నులు కాగా.. ప్రపంచంలో ఇది 450 టన్నులుగా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగానే భవన నిర్మాణ రంగాన్ని కర్బనరహితంగా చేయాలని భావిస్తున్నారు.
దేశంలో సంప్రదాయక నిర్మాణాల్లో ఉపయోగించే రెండు కీలక పదార్ధాలు ఉక్కు, సిమెంట్. ఇవి రెండూ కూడా కార్బన్ సహితమైనవే. ఈ నేపథ్యంలో సాధారణ పోర్ట్ ల్యాండ్ సిమెంట్ కంటే తక్కువ కార్బన్ ఉన్న సిమెంట్ (సున్నపురాయితో కూడిన క్లే సిమెంట్)ను ఉపయోగిస్తే 40 శాతం ఉద్గారాలు తగ్గుతాయి. దీనిని దేశంలోని 25 కంటే ఎక్కువ ప్రాజెక్టుల్లో వినియోగించారు. ఢిల్లీల్లోని స్విస్ ఎంబసీ కాంపౌండ్ లోని స్విస్ ఏజెన్సీ ఫర్ డెవలప్ మెంట్ అండ్ కో ఆపరేషన్ భవనాన్ని 2019లో ఈ సిమెంట్ తోనే నిర్మించారు. అలాగే సిమెంట్, స్టీల్ తోపాటు నిర్మాణరంగంలో విరివిగా వినియోగించే ఎర్రమట్టి ఇటుకలు కూడా కర్బన ఉద్గారాలు విడుదల చేసేవేనని.. ఎర్ర బంకమట్టి ఇటుకల ఉత్పత్తి బట్టీల వద్ద అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. ఇది గణనీయమైన శక్తిని వినియోగిస్తుంది. శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల ఇది వస్తుంది. దీంతో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు విడుదలవుతాయి. అలాగే బంకమట్టి వెలికితీత వల్ల స్థానిక పర్యావరణ వ్యవస్థలకు భంగం కలుగుతుంది. దీనివల్ల నేల కోతకు గురికావడం, ఇళ్లకు, జీవ వైవిధ్యానికి నష్టం కలగడం వంటివి జరిగే అవకాశం ఉంది. అందువల్ల వీటిని వినియోగించడం మానేయాలని.. వాటి స్థానంలో ఫ్లై యాష్ ఉపయోగించి చేసే ఇటుకలు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
రియల్ రంగంలో పర్యావరణపరమైన ఒత్తిడిని తగ్గించేందుకు పారిశ్రామిక, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల వినియోగాలని పెంచాలని పేర్కొంటున్నారు. సంప్రదాయకంగా నిర్మాణంలో వినియోగించే అల్యూమినియం, ఇతర లోహలను మళ్లీ వినియోగించే అవకాశం ఉంటుంది. కాంక్రీట్ తయారీలో కూడా నిర్మాణ కూల్చివేత వ్యర్థాలను వినియోగించొచ్చు. మరోవైపు 25 శాతం రీసైకిల్ చేసిన పదార్థాలను నిర్మాణ సామగ్రిగా ఉపయోగించడానికి అనుమతించినప్పటికీ, ఇది ఖర్చుతో కూడుకున్నదని నిరూపితమైంది. పైగా వాటి వినియోగాన్ని తప్పనిసరి చేసే చట్టాలు లేవు. భవనాల గ్రీన్ సర్టిఫికేషన్ ప్రమాణాల్లో ఇది కూడా ఉంది. అయితే, దీనిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాన్ని పొందుతున్న పెద్ద బిల్డర్లు మాత్రమే అవలంభిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ వ్యర్థాలను సరిగా నిల్వ చేయకపోవడం, సైట్ లలో దుమ్ము నియంత్రణ చర్యలు సరిగా చేపట్టకపోవడం వల్ల కాలుష్యం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రీ ఫ్యాబ్రికేషన్, మాడ్యులర్, 3డీ ప్రింటెడ్ వంటి ఆధునిక సాంకేతికతతో దుమ్ము, వ్యర్థాలను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ పబ్లిక్ భవనం బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఔట్ పోస్టాఫీస్. 2023లో ఎల్ అండ్ టీ దీనిని నిర్మించింది.