హైదరాబాద్ రియాల్టీ రంగంలో మరో ప్రీలాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. కొల్లూరులో కేవలం కోటి రూపాయలకే విల్లాలంటూ కోట్ల రూపాయల్ని వసూలు చేసిన జీఎస్సార్ గ్రూప్ చేతులెత్తేసింది. ఈ సంస్థ ఎండీ గుంటుపల్లి శ్రీనివాస్ రావు రకరకాల రియాల్టీ సంస్థలను ఆరంభించి.. వివిధ ప్రాంతాల్లో ప్రీలాంచ్ ప్రాజెక్టుల్ని మొదలెట్టి.. కోట్ల రూపాయల్ని దండుకున్నాడు. అయితే, ఈ మహానుభావుడు గత కొంతకాలం నుంచి పత్తాలేకుండా పోయాడని సమాచారం.
ఆయన పరోక్షంలో కొంతమంది వ్యక్తులు, సిబ్బంది సభ్యులు కలిసి బాధితులతో చర్చలు జరిపారు. అయితే అవన్నీ సఫలం కాకపోవడం.. గుంటుపల్లి శ్రీనివాస్ రావు కనిపించకుండా పోయారని భావించిన బాధితులు.. తొలుత స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్ చేశారు. దీంతో పోలీసులు అతని భార్యను పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారించారని సమాచారం. అయితే, అది జరిగి చాలాకాలం అయినప్పటికీ.. కళ్ల ముందు ఎలాంటి పరిష్కారం కనిపించకుండా పోవడంతో.. బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి, మరో ప్రీలాంచ్ మోసగాడి వలలో పడిన బాధితులు తమ కష్టార్జితాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసుకున్నారు. కాబట్టి, మీరో విషయం గుర్తుంచుకోండి. రేటు తక్కువంటే ఎవరి వద్ద ఫ్లాటు కానీ విల్లా కానీ కొనుగోలు చేయకండి ఇలా మోసపోకండి.
జీఎస్సార్ చేసిన ప్రీలాంచ్ మోసాన్ని మొట్టమొదట ఆర్ఈజీ న్యూస్ వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో బాధితులు కొంత మంది ఆర్ఈజీ న్యూస్‌కి ఫోన్ చేసి సమాచారాన్ని అందజేసింది. దీంతో, బాధితుల్ని ఇంటర్వ్యూలు చేసింది. వార్తల్ని ప్రచురితం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కాకపోతే, ఈ విషయాన్ని అప్పటి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు. ఫలితంగా, అప్పట్నుంచి బాధితులు తమ సొమ్ము కోసం సంస్థ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చివరిక విసుగు చెందిన బాధితులు తాజాగా సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. జీఎస్సార్ గ్రూప్ అధినేత గుంటుపల్లి శ్రీనివాస్ రావును అయితే పోలీసులు అరెస్టు చేస్తారు. కానీ, ఆతర్వాత అతను బయటికొచ్చాక.. బాధితులకు న్యాయం చేసేదెవరు? ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరముంది.
This website uses cookies.