దేశంలోని ప్రధాన నగరాల్లో అద్దెలు మరీ ఘోరంగా పెరిగిపోయాయి. వచ్చే వేతనాల్లో సగానికి పైగా అద్దెలకే వెచ్చించాల్సి వస్తోంది. ముంబైలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అద్దెలపరంగా అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై టాప్ లో ఉంది. ఇక్కడ సింగిల్ బెడ్ రూమ్ అద్దె సగటున రూ.43వేలు (ఏడాదికి రూ.5.18 లక్షలు) ఉండటం గమనార్హం. ముంబైలో ఓ జూనియర్ స్థాయి ఉద్యోగికి వచ్చే వార్షిక వేతనం (దాదాపు రూ.4.49 లక్షల) కంటే ఇది ఎక్కువ.
ఈ వివరాలను క్రెడాయ్-ఎంసీహెచ్ఐ పేర్కొంది. బెంగళూరు, ఢిల్లీల్లో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ వార్షిక అద్దె ఇందులో సగాని కంటే తక్కువ. బెంగళూరులో రూ.2.32 లక్షలు, ఢిల్లీలో రూ.2.29 లక్షలుగా ఇది ఉంది. బెంగళూరులో ఉద్యోగి సగటు వార్షిక వేతనం రూ.5.27 లక్షలు కాగా, ఢిల్లీలో రూ.4.29 లక్షలుగా ఉంది. అంటే వారి వేతనంలో సగం మేర అద్దెకే చెల్లించాల్సి వస్తోందన్నమాట. ముంబైలో సగటున రూ.15 లక్షల వార్షిక వేతనం తీసుకునే మధ్య స్థాయి ఉద్యోగులు 2 బీహెచ్ కే అపార్ట్ మెంట్ కోసం దాదాపు రూ.7.5 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. అదే బెంగళూరులో రూ.16.45 లక్షల వార్షిక వేతనం తీసుకునే మధ్య స్థాయి ఉద్యోగులు ఏడాదికి అద్దె నిమిత్తం దాదాపు రూ.3.90 లక్షలు చెల్లిస్తున్నట్టు నివేదిక తెలిపింది.
ఢిల్లీ విషయానికి వస్తే రూ.14.07 లక్షల వేతనం పొందుతున్న ఉద్యోగులు అద్దె నిమిత్తం రూ.3.55 లక్షలు వెచ్చిస్తున్నట్టు వివరించింది. అలాగే రూ.33.95 లక్షల వార్షిక వేతనం పొందుతున్న సీనియర్ స్థాయి ఉద్యోగులు 3 బీహెచ్ కే అపార్ట్ మెంట్ కోసం సగటున ఏడాదికి రూ.14.05 లక్షలు వెచ్చిస్తున్నారు. అదే బెంగళూరులో రూ.35.35 లక్షల వేతనం పొందుతున్న ఉద్యోగులు సగటున అద్దె నిమిత్తం రూ.6.25 లక్షలు, ఢిల్లీలో రూ.30.73 లక్షల వేతనం పొందే ఉద్యోగులు రూ.5.78 లక్షల అద్దె చెల్లిస్తున్నారు.
This website uses cookies.