* సర్వే నెంబర్ 138/ఏఏలో కోర్టు కేసు
* 138 సర్వే నెంబరులో ప్రాజెక్టుకు అనుమతి
* ఇదెలా సాధ్యమని పురపాలక శాఖ ఆరా
* ఒక్కొక్కటిగా బయటికొస్తున్న హెచ్ఎండీఏ లొసుగులు
* అనుమతి మంజూరు చేయాలని బీఆర్ఎస్ నేత సిఫార్సు?
* హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ సలహా ఇచ్చాడా?
* కోర్టు కేసున్న స్థలం వదిలేసి ఇతర సర్వే నెంబర్లతో దరఖాస్తు చేశారా?
కోర్టు కేసులో ఉన్న భూమిలో హెచ్ఎండీఏ అనుమతి ఎలా ఇచ్చిందంటూ ఆర్ఈజీ న్యూస్ రాసిన కథనంపై ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఆర్ఎస్ పసురా తెల్లాపూర్ డెవలపర్స్ ప్రాజెక్టుకు ఎలా అనుమతినిచ్చారు? ఆ ప్రాజెక్టు ఏయే సర్వే నెంబర్లలో నిర్మిస్తున్నారు? అందుకు సంబంధించిన సర్వే నెంబర్లలో కేసులేమైనా ఉన్నాయా? తదితర వివరాలతో నివేదికను సమర్పించమని పురపాలక శాఖ హెచ్ఎండీఏను ఆదేశించింది. దీంతో, రంగంలోకి దిగిన హెచ్ఎండీఏ అధికారులు.. ఆర్ఎస్ పసురా తెల్లాపూర్ డెవలపర్స్ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాల్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించి తెల్లాపూర్ కమిషనర్ స్వయంగా వివరాల్ని సేకరిస్తున్నారని సమాచారం. అయితే, ఈమధ్య ఏసీబీకి చిక్కిన బాలకృష్ణ హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే.. కోర్టు కేసు ఉన్నప్పటికీ, కొల్లూరులో ఆర్ఎస్ పసురా డెవలపర్స్‌కి అనుమతినిచ్చాడని తెలిసింది. ఆయన సలహా మేరకు కోర్టు కేసు సర్వే నెంబర్ల బదులు ఇతర సర్వే నెంబర్లను చూపెట్టి అనుమతికి దరఖాస్తు చేసుకున్నారని సమాచారం.
తప్పు ఎక్కడ దొర్లింది?
ఆర్ఎస్ పసురా తెల్లాపూర్ డెవలపర్స్ ఎల్ఎల్పీ అనే రియల్ సంస్థ.. కొల్లూరులోని 137, 138 సర్వే నెంబర్లలో 24.14 ఎకరాల స్థలంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టును నిర్మించేందుకు.. ఆయా స్థల యజమానులతో ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత హెచ్ఎండీఏ నుంచి 15.26 ఎకరాల స్థలంలో అపార్టుమెంట్లను కట్టేందుకు అనుమతి (0023225/బీపీ/హహెచ్ఎండీఏ/0468/ఎస్కేపీ 2023)ని తీసుకుంది. పది శాతం బిల్టప్ ఏరియాను బిల్డర్ హెచ్ఎండీఏకు మార్టిగేజ్ (18125/2023) చేశారు. ఇది పటాన్చెరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ కావడం గమనార్హం. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. కొల్లూరు గ్రామంలోని సర్వే నెంబర్ 138లో భాగమైన 138/ఏఏ సర్వే నెంబరుకు సంబంధించి సంగారెడ్డి కోర్టులో కేసు ఉంది. అలాంటప్పుడు హెచ్ఎండీఏ అనుమతి ఎలా ఇచ్చిందంటూ కొందరు వ్యక్తులు మీడియాకు పూర్తి సమాచారాన్ని అందించారు. అంటే, 138/ఏఏ సర్వే నెంబరు 138 సర్వే నెంబర్లో భాగం కాదా? అది వేరే సర్వే నెంబరా? ఈ అంశం తెలిసే హెచ్ఎండీఏ కాసులకు కక్కుర్తిపడి అనుమతిని మంజూరు చేశారా? లేక కేసు ఉందనే విషయం తెలియక అనుమతినిచ్చేశారా? మరి, 138/ఏఏ సర్వే నెంబరుపై కేసు ఉన్నందు వల్ల.. ఆర్ఎస్ పసురా డెవలపర్స్‌కు ఇచ్చిన అనుమతిని హెచ్ఎండీఏ రద్దు చేస్తుందో లేదో అతిత్వరలో తెలుస్తుంది. అయితే, ఆ సర్వే నెంబరుతో తమకు సంబంధం లేదని.. అసలా సర్వే నెంబరులో కోర్టు కేసున్న విషయం తమకు తెలియదని డెవలపర్ అంటున్నారు.