భారత్ లోని ఏడు ప్రధాన మెట్రో నగరాల్లో ఇళ్ల అద్దెలు పెరిగినట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ అనరాక్ స్పష్టం చేసింది. ఇంటి అద్దెలతో పాటు ఇళ్ల ధరలు సైతం పెరిగినట్లు తాజా నివేదికలో పేర్కొంది. అయితే ఇళ్ల ధరల్లో పెరుగుదలకు అనుగుణంగా ఇంటి అద్దెలు పెరగలేదు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు, పుణె, కోల్‌కతా, చెన్నై నగరాల్లోని ఇంటి అద్దెలు, ఇళ్ల ధరల స్థితిగతులపై అనరాక్ సర్వే నిర్వహించింది. 2021 నుంచి 2024 మధ్యకాలంలో 7 మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలు ఏకంగా 128 శాతం పెరిగాయి. బెంగళూరు, ముంబై, ఎన్‌సీఆర్ ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ఇంటి అద్దెల పెరుగుదలతో పోలిస్తే ఇళ్ల ధరలు అధికమయ్యాయి. ఇక పుణె, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదల కంటే అద్దెలు పెరిగినట్లు అనరాక్ స్పష్టం చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఇంటి అద్దె పెరుగుదల కంటే, ఇళ్ల ధరల్లో అధిక వృద్ధి ఉన్నట్లు తేలింది. హైటెక్ సిటీ ప్రాంతంలో ఇళ్ల ధరల్లో 62 శాతం వృద్ది నమోదవ్వగా, ఇక్కడ ఇంటి అద్దెల్లో పెరుగుదల 54 శాతమేనని అనరాక్ పేర్కొంది. గచ్చిబౌలిలో ఇళ్ల ధరల్లో 78 శాతం, ఇంటి అద్దెల్లో 62 శాతం వృద్ధి కనిపించింది. ఇళ్ల విలువ పెరగాలని ఆశించే కొనుగోలుదారులకు.. హైదరాబాద్, నోయిడా, ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ అనుకూల నగరాలని తెలిపింది. ఇదే సమయంలో ఇంటి అద్దెలు ఎక్కువగా పెరగాలని ఆశించే పెట్టుబడిదారులకు ఇతర మెట్రో నగరాలను పరిశీలించాలని సూచించింది.