హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీని కలుపుతూ రీజినల్ రింగు రోడ్డు వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారిని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి హెచ్‌ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. దీంతో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వచ్చే ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొంత కదలికలు వచ్చాయి. మొన్నటి వరకూ అంతంత మాత్రంగానే ఉన్న భూముల లావాదేవీలు పెరగడంతో పాటు ధరలు పెరిగాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలో ఫ్యూచర్ సిటీ పేరుతో ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తోంది. భవిష్యత్తు నగర నిర్మాణంలో భాగంగా.. పలు ప్రభుత్వ రంగ సంస్థల శంకుస్థాపనలు మొదలయ్యాయి. ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం ప్రారంభం కాగా.. ఏఐ సిటీ పనుల్ని త్వరలోనే ఆరంభిస్తామని సమాచారం. ఈ క్రమంలో హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి ఫ్యూచర్ సిటీలను కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మించేలా ప్రణాళికల్ని సిద్ధం చేశారు. ఈ మేరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి పనుల కోసం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ టెండర్లను ఆహ్వానించింది. రెండు ప్యాకేజీల్లో ఈ రహదారి పనులు పూర్తి చేసేందుకు సిద్ధమైంది.
ప్రస్తుత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుని రావిర్యాల ఇంటర్ ఛేంజర్ 13 నుంచి ఆమన్‌గల్ రీజనల్ రింగ్ రోడ్డు కనెక్ట్ చేస్తూ గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మిస్తారు. మొత్తం 41.50 కిలోమీటర్ల పొడవుతో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే రహదారి నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ సైతం తుది దశకు చేరుకుంది. మొదటి దశలో రావిర్యాల్ ఇంటర్ ఛేంజర్ నుంచి రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట్ వరకు 19.2 కిలో మీటర్ల మేర రహదారిని నిర్మిస్తారు. రెండవ దశలో మీర్‌ఖాన్‌పేట్ నుంచి ఆమన్‌గల్ వరకు మెుత్తం 22.30 కిలో మీటర్ల మేర రహదారిని నిర్మిస్తారు. 100 మీటర్ల వెడల్పుతో యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ ప్రెస్ వేను అభివృద్ది చేయనున్నారు. ఆరు లైన్ల మెయిన్ క్యారేజ్ వేను భవిష్యత్తులో 8 లైన్లుగా విస్తరించేందుకు వెసులుబాటుగా భూసేకరణ చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమన్‌గల్ మండలాలతో పాటుగా.. 14 గ్రామాలను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ రహదారిని అందుబాటులోకి తెస్తారు. తొలి దశ 19.2 కిలో మీటర్లకు గాను రూ.1,665 కోట్ల వ్యయం కాగా, రెండవ దశ 22.30 కిలో మీటర్ల రోడ్డుకు రూ.2,365 కోట్లు అంచనా వ్యయంగా నిర్థారించారు. ఆ మార్గంలో మెట్రో, రైల్వే కారిడార్ కోసం అటు ఇటు 20 మీటర్ల వెడల్పుతో భూమి రిజర్వు చేస్తారు. పచ్చదనం కోసం 2 మీటర్ల వెడల్పుతో సెంట్రల్ మీడియన్, ఇరు వైపులా గ్రీన్ బెల్ట్, సైకిల్ ట్రాక్, యుటిలిటీ కారిడార్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణంతో ఆయా గ్రామాల్లో భూమలు ధరలు పెరుగుతాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. మొన్నటి వరకు కాస్త స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్.. గ్రీన్ ఫీల్డ్ రోడ్ల టెండర్ల పిలుపుతో భూముల క్రయ విక్రయాలు ఊపందుకుంటాయని అంటున్నారు.
Like this:
Like Loading...