హైదరాబాద్లో ప్లాట్లు కొనాలని భావించేవారికి అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. భాగ్యనగరానికి భౌగోళిక అడ్డంకులేమీ లేకపోవడంతో.. నగరం నాలుగువైపులా విస్తరిస్తున్నది. పశ్చిమ హైదరాబాద్‌లో కొల్లూరు, శంకర్‌పల్లి, వికారాబాద్, మరోవైపు కంది, సంగారెడ్డి వరకూ ప్లాట్లు అందుబాటు ఉండగా.. దక్షిణ హైదరాబాద్‌లో మహేశ్వరం, ఆమన్‌గల్ వరకూ ప్లాట్లు దొరుకుతున్నాయి. ఈస్ట్ హైదరాబాద్లో చౌటుప్పల్, వరంగల్ రహదారిలోని జనగాం దాకా వెంచర్లు అభివృద్ధి చెందాయి. ఇక ఉత్తర హైదరాబాద్ విషయానికి వస్తే.. మేడ్చల్ దాటి తూప్రాన్ దాకా వెంచర్లను వివిధ రియల్టర్లు డెవలప్ చేస్తున్నారు.
సంగారెడ్డిలోని పెద్దాపూర్, కంది, సంగారెడ్డి, ఆత్మకూర్ వంటి ప్రాంతాల్లో ప్లాట్ల ధరలు గజానికి 20 నుంచి 35 వేల వరకూ చెబుతున్నారు. అదే ఆత్మకూరు వంటి ప్రాంతంలో 165 గజాల ప్లాటు 15 లక్షలకు దొరుకుతుంది. కంది ఐఐటీ వద్ద గజానికి రూ.35వేలు కొందరు చెబుతుండగా.. రుద్రారంలో హెచ్ఎండీఏ లేఅవుట్‌లో 28 వేల చొప్పున లభిస్తున్నాయి. యాచారంలో డీటీసీపీ ప్లాట్లను పలు సంస్థలు గజానికి 14 నుంచి 18 వేల దాకా విక్రయిస్తున్నారు. బాచారం, ఇస్మాయిల్‌ఖాన్‌పేట్ వంటి ప్రాంతాల్లో గజానికి రూ.21 చొప్పున దొరుకుతున్నాయి. చౌటుప్పల్లో కొందరు రియల్టర్లు గజానికి రూ.18 వేలకు విక్రయిస్తుండగా.. షాద్‌నగర్ వంటి ప్రాంతాల్లో డీటీసీపీ లేఅవుట్లలో గజం ప్లాటు ధర రూ.26 వేలు చెబుతున్నారు.
హైదరాబాద్ రియల్ రంగంలో కరోనా తర్వాత సరికొత్త పోకడ మొదలైంది. నిన్నటివరకూ రియల్ సంస్థలే నేరుగా ప్లాట్లను విక్రయించేవి. కానీ, గత కొంతకాలం నుంచి మార్కెట్లో ఛానెల్ పార్ట్‌నర్లు, రియాల్టీ ఏజెంట్లు ప్లాట్లను విక్రయిస్తున్నారు. అందుకే, మీరు ఎవరి వద్ద ప్లాట్లను కొంటున్నారనే విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. నేరుగా సంస్థ వద్ద కొంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఆయా సంస్థ ఎండీ, ఛైర్మన్‌ను మీరు నేరుగా కలిసే అవకాశం ఉంటుంది. ధర గురించి ఎంతోకొంత బేరమాడే అవకాశం లభిస్తుంది. ఛానెల్ పార్ట్‌నర్లు లేదా ఏజెంట్ల ద్వారా ప్లాట్లను కొనుగోలు చేస్తే.. కొన్ని సందర్భాల్లో మీరు కట్టే సొమ్ము ఆయా సంస్థకు చేరకపోవచ్చు. ఇటీవల సువర్ణభూమి డెవలపర్స్ లో ఇంచుమించు ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. కొన్నిసార్లు మీరు ఛానెల్ పార్ట్‌నర్‌కు సొమ్ము కట్టిన తర్వాత.. సదరు రియల్టర్ లేదా ల్యాండ్ లార్డ్ మీకు ప్లాట్లను కేటాయించకపోవచ్చు. ఇలాంటి ఒక సంఘటన ఇటీవల చేవేళ్ల సమీపంలో ఒక లే అవుట్‌లో జరిగింది. రెండేళ్ల క్రితం కొనుగోలుదారుడు ప్లాటును కొనుగోలు చేయగా.. స్థలయజమాని ప్లాటు లేదంటున్నాడని ఆయా ఛానెల్ పార్ట్‌నర్ చేతులెత్తేశాడు. సంగారెడ్డి, సదాశివపేట్ వంటి ప్రాంతాల్లోనూ ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. కాబట్టి, ప్లాటు కొనే ముందు ఎవరి నుంచి కొంటున్నామని ఒకటికి రెండు సార్లు నిర్థారించుకున్నాకే సొమ్ము చెల్లించండి.