- కోర్టు తీర్పుతో భూయాజమాన్యం.. ప్లాట్ల కొనుగోలు దారుల మధ్య ఘర్షణ
- రాళ్ళు రువ్వుకున్న ఇరువర్గాలు,. పలువురికి గాయాలు
- బైక్ లకు నిప్పు.. భారీగా పోలీసుల మోహరింపు..
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడలో భూవివాదం నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూవివాదంలో చెలరేగిన ఘర్షణ పరస్పరం రాళ్లదాడులకు, బైక్ లకు నిప్పంటించే వరకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే… కమ్మగూడలోని శివాజీ నగర్ ఫేస్2 సర్వే నెంబర్ 240, 241, 242లో 10.09 ఎకరాల భూమి విషయంలో ఓ మహిళకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆ భూమి తమదేనంటూ కొన్నాళ్లుగా అక్కడ ఆ మహిళ వర్గం కబ్జా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో వెంచర్లు ఏర్పాటు కావడంతో పాటు ప్లాట్ల విక్రయాలు జరిగాయి. ప్లాట్లు కొనుగోలు చేసిన కొందరు ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. దీంతో ప్లాట్లు, ఇళ్ల యజమానులకు, ఆ మహిళ వర్గానికి సంబంధించి భూవివాదం నడుస్తోంది. 10రోజుల క్రితం ప్లాట్లలో వేసిన కడీలను, ప్రీకాస్ట్ తో పాటు తాత్కాలిక నిర్మాణాలను కూల్చారు.
ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున మరోసారి తమకు కోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయంటూ పలువురు ప్లాట్ల కడీలు, ఫ్రీ కాస్ట్ గోడలను నిర్మించేందుకు యత్నించారు. దీంతో స్థానిక ప్రజలు, ప్లాట్ల యజమానులు కబ్జాకు యత్నిస్తున్న వారిని అడ్డుకోవడంతో పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఇరువర్గాలు ప్రతిఘటించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనలో రెండు బైకులకు నిప్పించడంతో పూర్తిగా దగ్ధం అయ్యాయి.
ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులపై సైతం రాళ్ళు రువ్వారు. ఈ ఘటనలో పలువురికి రాళ్ళు తగిలి స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడటంతో కబ్జాకు యత్నిస్తున్న వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వనస్థలిపురం పోలీసులు భారీగా మోహరించి, ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఘర్షణ అనంతరం కూడా ఎలాంటి ఆవాంచని సంఘటన చోటుచేసుకోకుండా సంఘటన స్థలంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.