శ్మశాన వాటిక స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్న రాంకీ సంస్థకు హైడ్రా నోటీసులు ఇవ్వడంతో వివాదం మొదలైంది. దీనిపై రాంకీ యాజమాన్యం సీఎం దగ్గర పంచాయతీ పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఓ ప్రభుత్వ సలహాదారుడి దగ్గర రాంకీ యాజమాన్యం రాయబేరానికి దిగింది. ఉద్దేశపూర్వకంగానే హైడ్రా తమ సంస్థను బద్నాం చేస్తుందని, తమకు కేటాయించిన భూమి పరిధిలోకి మీడియాతో వచ్చి హడావుడి చేశారంటూ వివాదానికి ఆజ్యం పోస్తుంది. అయితే, తమపై ఫిర్యాదులు ఉంటే ముందుగా తమ వివరణ అడుగాల్సి ఉందని, కానీ, మీడియా, స్థానికులతో కలిసి వచ్చి ఎందుకు హడావుడి చేశారంటూ ప్రశ్నిస్తుంది. దీంతో తమ సంస్థపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, దీనికి ప్రధాన కారణం హైడ్రా అంటూ రాంకీ యాజమాన్యం మండిపడుతుంది.
మీరే మాట్లాడాలి
ఇటీవల హైడ్రా మీద విమర్శలు ఎక్కువయ్యాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలే హైడ్రా తీరును తప్పు పడుతున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఏకంగా హైడ్రా నోటీసులు ఇచ్చి సెటిల్‌మెంట్లు చేస్తుందని విమర్శించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఈ వివాదం నడుస్తుండగానే ఇప్పుడు రాంకీ లొల్లి మొదలైంది. అల్వాల్ మండలం మచ్చబొల్లారంలోని శ్మశాన వాటిక స్థలాలను రాంకీ నిర్మాణ సంస్థ కబ్జా చేసినట్లు మచ్చబొల్లారం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ కొన్నాళ్ల క్రితం హైడ్రాకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శ్మశానవాటిక, పక్కనున్న ప్రభుత్వ భూములను రంగనాథ్ పరిశీలించారు. అనంతరం రంగనాథ్ మాట్లాడుతూ సర్వే నంబర్ 199లో మొత్తం 15.19 ఎకరాల స్థలం హిందూ శ్మశాన వాటికకు కేటాయించగా, అందులో రెండు ఎకరాలు రాంకీకి ఇచ్చారని, కానీ, దానికి అనుగుణంగా ఇంకో రెండు ఎకరాలు కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నట్లు చెప్పకొచ్చారు. దీనిపైనే రాంకీ.. సీఎం దగ్గర పంచాయతీ పెడుతుంది. ఓ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న నేత దగ్గరకు వెళ్లి.. సీఎంతో మాట్లాడాలంటూ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాము నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేస్తున్నామని, ఒకవేళ కబ్జాలు తేలితే తమకు నోటీసులు ఇవ్వాల్సి ఉందని, కానీ, అందరినీ వెంటేసుకుని తమకు కేటాయించిన భూముల్లో ఎలా పర్యటిస్తారని ప్రశ్నిస్తోంది. దీంతో మళ్లీ హైడ్రా మీద అంతర్గత ఆరోపణలు చేసినట్లుగా మారింది. ఇక్కడ హడావుడి చేసి సదరు సంస్థతో సెటిల్‌మెంట్ చేసుకునేందుకే హైడ్రా హడావుడి చేస్తుందనే విమర్శలు మొదలయ్యాయి.