ట్రాఫిక్ రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంతమైన ప్రదేశంలో తమ ఇల్లు ఉండాలని చాలామందే కోరుకుంటారు. కానీ నటుడు శ్రీరామ్ మాత్రం ఇందుకు భిన్నం. తన చుట్టూ గోల ఉండాలని.. అలాంటి చోటే తన ఇల్లు ఉండాలని స్పష్టంచేశారు. ఈ శుక్రవారం విడుదలైన ‘అసలేం జరిగింది’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీరామ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఒకరికి ఒకరు, దడ, ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే, లై వంటి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. శ్రీరామ్ తెలుగువాడే అయినా.. తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. తీరిక లేని షెడ్యూల్ ఉన్నప్పటికీ తన కలల గృహం ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి వంటి అనేక విషయాలపై రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడారు. హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్నట్టు చెప్పారు.
హైదరాబాదీ అయిన శ్రీరామ్.. ఇక్కడే పెరిగారు. భాగ్యనగరంలో ఆయనకు రెండు ఇళ్లు కూడా ఉండేవి. అయితే, కొన్ని కారణాల వల్ల వాటిని అమ్మేశానని.. తనది అని చెప్పుకునే నగరంలో సొంతిల్లు లేకపోవడం చాలా బాధగా అనిపిస్తుందని చెప్పారు. ‘హైదరాబాద్ లో నాకు రెండిళ్లు ఉండేవి. నా సోదరుడు చనిపోయిన తర్వాత వాటిని అమ్మేశాం. నేను పెరిగిన చోట నాకు ఇల్లు లేదనే అపరాధ భావం నన్ను తొలిచేస్తూ ఉంటుంది. హైదరాబాద్ లో మంచి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది’’ అని తెలిపారు. తనకు చెన్నైలో ఆస్తులు ఉన్నప్పటికీ, హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ‘నా నగరం హైదరాబాద్ ఎప్పుడొచ్చినా ఉండటానికి ఇల్లు లేదు. దాంతో హోటల్స్ లో ఉంటా. అది సౌకర్యవంతమే అయినప్పటికీ, సొంతూరిలో ఇల్లు లేదనే బాధ కలుగుతుంటుంది’ అని శ్రీరామ్ వెల్లడించారు. హైదరాబాద్ లో ఇళ్లను ఎందుకు అమ్మేయాల్సి వచ్చిందో ఆయన వివరించారు. ‘ఇక్కడున్న నా ఇళ్లను సరిగా చూసుకోలేను. పైగా నా సోదరుడు మరణించడంతో సెంటిమెంట్స్ కూడా తోడయ్యాయి. ఈ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడాలనుకున్నా. అందుకే వాటిని అమ్మేశా. కానీ త్వరలోనే హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కుంటాను’ అని పేర్కొన్నారు.
ఇక హైదరాబాద్ లోని ఏ ఏరియాలో ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారు అని అడిగినప్పుడు శ్రీరామ్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. చాలా నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం కాదని స్పష్టంచేశారు. నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుందని.. అందువల్ల తన చుట్టూ గోల ఉండటాన్నే ఇష్టపడతానని చెప్పారు. ‘చాలా ప్రశాంతంగా ఉండే ఇళ్లలో నేను ఉండలేను. నేను ఉండేచోట ఎప్పుడూ గోల ఉండాలి. అసలేం జరిగింది షూటింగ్ సందర్భంగా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాం. అక్కడ కొన్నిచోట్ల సాయంత్రం కరెంటు కూడా ఉండేది కాదు. చుట్టూ అడవులు ఉండటంతో నిర్దిష్ట సమయం తర్వాత ఏమీ దొరికేవి కావు. అందువల్ల కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు. అలాంటివాటిని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ఈ సినిమా సందర్భంగా ఇలాంటి ఎన్నో విషయాల్లో రాజీపడ్డాం. కానీ నిజజీవితానికి వచ్చేసరికి అమీర్ పేట, పంజగుట్ట, బంజారాహిల్స్ వంటి జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే నాకు ఇల్లు ఉండాలని కోరుకుంటా. అక్కడ కావాల్సినంత గోలతోపాటు అంతకుమించిన ట్రాఫిక్ ఎప్పుడూ ఉంటుంది’ అని నవ్వేశారు శ్రీరామ్.
ఇక ఇంటి డిజైన్ ఎలా ఉండాలనే విషయంలో పూర్తి నిర్ణయం తన భార్య వందనదేనని శ్రీరామ్ స్పష్టంచేశారు. తన ఇల్లు ఎలా ఉండాలనే విషయంలో తనకు కొన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ, తనకంటే తన భార్యే ఈ విషయంలో బాగా నిర్ణయం తీసుకోగలదని పేర్కొన్నారు. ‘ఇంటి డిజైన్, ఇంటీరియర్స్ ఎలా ఉండాలనే అంశంపై నా మదిలో బోలెడు ఆలోచనలున్నాయి. కానీ ఇలాంటి విషయాల్లో ఎంతో చక్కని విజన్ ఉన్న అందమైన భార్యను కలిగి ఉండటం నా అదృష్టం. అందుకే ఇవన్నీ ఆమె నిర్ణయానికే వదిలేయాలనుకుంటున్నాను. వీటిని సమర్థవంతంగా నిర్వహించగల సత్తా ఆమెకు ఉంది. ఇలాంటి విషయాల్లో ఇల్లాలికి పూర్తి స్వేచ్ఛనివ్వడం బాగుంటుంది. పైగా సెలక్షన్ విషయంలో నాకంటే ఆమె నిర్ణయమే మెరుగ్గా ఉంటుందని భావిస్తాను’ అని వెల్లడించారు. చివరగా.. సినిమాలను థియేటర్లలోనే చూసి సినీ పరిశ్రమకు అండగా నిలవాలని శ్రీరామ్ అభ్యర్థించారు. ఎక్సోడస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించిన అసలేం జరిగింది సినిమా అక్టోబర్ 22న విడుదలైందని.. ప్రతిఒక్కరూ ఆ సినిమా చూసి తమను ఆశీర్వదించాలని కోరారు. నిజజీవిత సంఘటనల ఆధారంగా గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందని తెలిపారు.
This website uses cookies.