గతేడాది తెలంగాణ ఎన్నికలు మరో 20 రోజుల్లో ఉందనగా.. శంకర్‌పల్లి హెచ్ఎండీఏ ప్లానింగ్ ఆఫీసర్.. వెనకా ముందు చూడకుండా.. రెండు ఫైళ్లను ప్రాసెస్ చేసేశాడు. మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తే ఎలాంటి సమస్య ఉండకపోయేది. కాకపోతే, ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టడంతో.. ఒక్కసారిగా అధికారుల అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్‌ను హెచ్ఎండీఏ కమిషనర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వ్యుల్ని జారీ చేశారు. పురపాలక శాఖలో సంచలనం రేకెత్తించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
2023 నవంబర్ 10న పుప్పాల్‌గూడలోని 330, 332 సర్వే నెంబర్లలో మాస్టర్ ప్లాన్ రోడ్డులో 11698 గజాల స్థలాన్ని కోల్పోతున్నామంటూ శ్రవణ్ కుమార్ తదితరులు శంకర్‌పల్లి హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకున్నారు. కోల్పోతున్న భూమికి సమానంగా టీడీఆర్ సర్టిఫికెట్‌ను జారీ చేయమని విజ్ఞప్తి చేశారు. మరో సంఘటనలో గండిపేట్ మండలంలోని పుప్పాల్‌గూడ 314, 315, 316, 317 సర్వే నెంబర్లలో.. 22,046 గజాల స్థలం మాస్టర్ ప్లాన్ రోడ్డులో కోల్పోతున్నామని వెంకటరమణ తదితరులు దరఖాస్తు చేశారు. తాము కోల్పోయిన భూమికి తగ్గ టీడీఆర్ సర్టిఫికెట్‌ను మంజూరు చేయాలని కోరారు. అయితే, ఈ రెండు దరఖాస్తులకు సంబంధించి హెచ్ఎండీఏ శంకర్‌పల్లి జోన్ అసిస్టెంట్ ప్లానంగ్ ఆఫీసర్ బీవీ కృష్ణకుమార్ నిర్లక్ష్యంగా వ్యహరించాడని హెచ్ఎండీఏ గుర్తించింది. దరఖాస్తుదారుల యాజమాన్య హక్కులను పరిశీలించకుండా, సైట్ తనిఖీ చేయకుండా ఫైలును ప్రాసెస్ చేసినందుకు.. హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ బీవీ కృష్ణకుమార్‌ను బుధవారం హెచ్ఎండీఏ కమిషనర్ సస్పెండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎస్టేట్ ఆఫీసర్‌ను ఎంక్వయిరీ ఆఫీసర్‌గా నియమించారు.
This website uses cookies.