సాధారణంగా ప్రీలాంచ్ ప్రమోటర్లు ఏం చేస్తారంటే.. ఏదో ఒక చోట స్థలం చూసి.. ఆయా యజమానికి కొంత అడ్వాన్సు ఇచ్చి.. రెరా నుంచి అనుమతి తీసుకోకుండానే.. సోషల్ మీడియాలో ప్రచారాన్ని నిర్వహించి.. తక్కువ రేటుకే ఫ్లాట్లంటూ ప్రజలకు విక్రయిస్తారు. ఆ తర్వాత అందులో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేస్తారు. రెరా నుంచి అనుమతి తీసుకుని ప్రాజెక్టును ఆరంభిస్తారు.
మరి, హెచ్ఎండీఏ ఏం చేస్తోంది.. ప్రభుత్వ స్థలంలో.. ఎలాంటి మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయకుండానే.. పత్రికల్లో ప్రకటనల వర్షం కురిపించి.. కొనుగోలుదారులతో ముందస్తుగా సమావేశాల్ని నిర్వహించి.. బిడ్డర్ల మధ్య పోటీతత్వాన్ని నెలకొల్పి.. అధిక రేటుకు స్థలాల్ని విక్రయిస్తోంది. కొన్నవారి నుంచి 30 నుంచి 60 రోజుల్లో సొమ్ము తీసుకుని.. ఆతర్వాత అభివృద్ధి పనుల్ని చేపడుతుంది.
ఒక ప్రమోటర్ మరియు హెచ్ఎండీఏ చేస్తున్న పనుల్లో తేడా ఏమిటంటే.. ప్రమోటర్ బయటి వ్యక్తి అయితే.. హెచ్ఎండీఏ ప్రభుత్వ సంస్థ. కానీ, లెక్కప్రకారం చూస్తే.. తొలుత ప్లాటు లేదా ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. ముందే సొమ్ము తీసుకుని.. ఆ తర్వాత తీరిగ్గా అందులో మౌలిక సదుపాయాల్ని డెవలప్ చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే.. హెచ్ఎండీఏ భూముల్ని వేలం వేసే ముందు రెరా నుంచి అనుమతి తీసుకోనక్కర్లేదా? ఇలాగైతే, ప్రైవేటు ప్రమోటర్‌కు హెచ్ఎండీఏ మధ్య తేడా ఏముందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. భూములు, ప్లాట్లను వేలం వేసే ముందు హెచ్ఎండీఏ కూడా రెరా అనుమతి తీసుకునేలా కేంద్రం రెరా చట్టాన్ని సవరించాలి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థలు.. ఇలా ఎవరూ వేలం వేయాలన్నా రెరా అనుమతిని తప్పక తీసుకునేలా చట్టాన్ని మార్చాలి.