ఓఆర్‌ఆర్-ఆర్‌ఆర్‌ఆర్ ఇప్పుడు రాష్ట్రానికి తలమానికంగా మారింది. ఈ నేపథ్యంలో వీటి మధ్యనే అత్యాధునిక లాజిస్టిక్ హబ్‌లను హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాల్లో 100 ఎకరాల చొప్పున భూములు గుర్తించారు. నగరంలో సరకు రవాణా సులభతరం చేయడంతోపాటు స్థానికులకు ఈ హబ్‌ల ద్వారా ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ మేరకు సమగ్ర ప్రతిపాదనలను రోడ్లు, భవనాల శాఖకు పంపడానికి సిద్ధమవుతోంది.
భవిష్యత్తులో నగరంలో సరకు రవాణాను మరింత సులభతరం చేయడమే ఈ లాజిస్టిక్ హబ్‌ల ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. హెచ్‌ఎండీఏ ప్రస్తుతం రూపొందిస్తున్న మాస్టర్‌ప్లాన్‌లో ఈ లాజిస్టిక్ హబ్‌లకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఈ రెండు రింగ్ రోడ్ల మధ్య ప్రజారవాణా సౌకర్యాలతో పాటు లాజిస్టిక్ హబ్‌లు ఏర్పాటు చేస్తే, భవిష్యత్తులో సరకు రవాణా వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో బాటసింగారం, మంగల్‌పల్లిలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించిన లాజిస్టిక్ హబ్‌లు విజయవంతంగా నడుస్తున్నాయి. ప్రతి లాజిస్టిక్ హబ్‌ను దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం మేడ్చల్ జిల్లా డబీర్‌పూర్, బండమాచారం, రావల్‌కోల్, పూడూరు, యాద్‌గార్ పల్లి, రంగారెడ్డి జిల్లా కొండకల్, వెలిమల, బ్రాహ్మణపల్లి, వెంకటాపూర్, లింగారెడ్డి, దండుమైలారం గ్రామాల్లో భూములను గుర్తించారు. కాగా, లాజిస్టిక్ హబ్‌ల ఏర్పాటుతో ఈ గ్రామాలకు మహర్దశ పట్టనుంది. ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
This website uses cookies.