* కళ్లు మూసుకున్న సంగారెడ్డి ఎస్ఆర్‌వో
* నిషేధిత ఆస్తిపై డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్
* హెచ్ఎండీఏ మార్టిగేజ్ ను ఎలా రిజిస్టర్ చేశారు?
* ప్రీలాంచుల్లో అమ్ముతున్న బిల్డర్
* ఈ అంశాలేమి తెలియక కొంటున్న బయ్యర్లు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో హెచ్ఎండీఏ అధికారులు ఎంత దారుణంగా వ్యవహరించేవారో ఈ సంఘటనను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కోర్టులో పెండింగ్ కేసులో ఉన్న భూమిలో.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నిషేధిత ఆస్తిగా అధికారికంగా ప్రకటించిన స్థలంలో.. బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించుకునేందుకు.. హెచ్ఎండీఏ అనుమతిని మంజూరు చేసింది. ఈ అంశంలో సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కూడా నిబంధనల్ని తుంగలో తొక్కాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హెచ్ఎండీఏ, సంగారెడ్డి ఎస్ఆర్‌వోల దుర్మార్గపు చర్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్ఎస్ పసురా తెల్లాపూర్ డెవలపర్స్ ఎల్ఎల్‌పీ అనే రియల్ సంస్థ కొల్లూరులోని 137, 138 సర్వే నెంబర్లలో అన్వితా హై 9 అనే ప్రాజెక్టును నిర్మించేందుకు హెచ్ఎండీఏకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. అంతకంటే ముందు కొల్లూరులోని 137, 138 సర్వే నెంబర్లలో 24.14 ఎకరాల స్థలంలో.. ఆర్ఎస్ పసురా తెల్లాపూర్ బిల్డర్స్ ఎల్ ఎల్ పీ అనే బిల్డర్.. స్థలయజమానులతో కొంత స్థలాన్ని డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకున్నాడు. అనంతరం హెచ్ఎండీఏ నుంచి 15.26 ఎకరాల స్థలంలో అపార్టుమెంట్లను కట్టేందుకు అనుమతి (0023225/బీపీ/హహెచ్ఎండీఏ/0468/ఎస్‌కేపీ 2023)ని తీసుకున్నారు. పది శాతం బిల్టప్ ఏరియాను బిల్డర్ హెచ్ఎండీఏకు మార్టిగేజ్ (18125/2023) చేశాడు. ఇది పటాన్‌చెరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ కావడం గమనార్హం. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. కొల్లూరు గ్రామంలోని సర్వే నెంబర్ 138/ఏఏ (138 సర్వే నెంబర్ సబ్ డివిజన్)కు సంబంధించి సంగారెడ్డి కోర్టులో కేసు ( ఓఎస్ 182/2016, 28.12.2016) ఉంది.
ఇదే కాకుండా, తెలంగాణ స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్స్ శాఖ ఈ భూమిని నిషేధిత ప్రాపర్టీగా రూరల్ ప్రొహిబిటెడ్ రిజిస్టర్‌లో నమోదు చేసింది. మరి, ఈ రెండు కీలకమైన అంశాల్ని పరిశీలించకుండా.. హెచ్ఎండీఏ బిల్డింగ్ పర్మిషన్ ఎలా ఇస్తుంది? స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్స్ శాఖ ఈ ఆస్తిని నిషేధిత జాబితాలో పెట్టినప్పటికీ, ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డెవలప్మెంట్ అగ్రిమెంట్‌ను ఎలా రిజిస్టర్ చేసింది? నిషేధిత ఆస్తి మీద హెచ్ఎండీఏ ఇచ్చిన అనుమతి మీద మార్టిగేజ్ ఎలా రిజిస్టర్ చేసింది?
సందిట్లో సడేమియాలా ఈ బిల్డర్ ఏం చేశాడంటే.. రెరా అనుమతి లేకుండానే ప్రీలాంచ్ ఆఫర్లు అంటూ ఫ్లాట్లను విచ్చలవిడిగా విక్రయించడం ఆరంభించాడు. వన్‌టైమ్ ఆఫర్, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటూ.. గత కొంతకాలం నుంచి అమాయకుల నుంచి సొమ్ము వసూలు చేస్తూనే ఉన్నాడు. ఈ అంశాలేమీ పట్టించుకోకుండా.. రేటు తక్కువకు వస్తుంది కదా అని వెనకా ముందు చూడకుండా తమ కష్టార్జితాన్ని ఈ ప్రాజెక్టు మీద పెడుతున్నారు. మరి, ఇప్పటికైనా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని.. పురపాలక శాఖ బాధ్యతల్ని చేపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అక్రమ పద్ధతిలో ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలి. ఇందుకు బాధ్యులైన హెచ్ఎండీఏ, సంగారెడ్డి రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల్ని సస్పెండ్ చేయాలి.