Categories: TOP STORIES

తొర్రూరు.. ఒద్దు సారు!

  • హెచ్ఎండీఏ చ‌రిత్ర‌లో ప్ర‌ప్ర‌థ‌మంగా
  • వేలంలో ప్లాట్లు వ‌ద్ద‌న్న బ‌య్య‌ర్లు
  • ఈ ధ‌ర‌లే మిగ‌తా వెంచ‌ర్ల‌కూ వ‌ర్తించ‌దు

హెచ్ఎండీఏ.. ఎక్క‌డ లేఅవుట్ వేసినా.. ప్ర‌జ‌ల్నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తుంది. ఒక ప్లాటును కొన‌డానికి క‌నీసం ఇద్ద‌రు లేదా ముగ్గురు పోటీ ప‌డ‌తారు. అలాంటిది, ఇటీవ‌ల తొర్రూరులో నిర్వ‌హించిన వేలం పాట‌ల్లో ప్లాట్లు కొనేవారు క‌రువ‌య్యారు. ఎన్న‌డూ లేని విధంగా.. కేవ‌లం పాతిక శాతం ప్లాట్లే అమ్ముడ‌య్యాయి. 48 ప్లాట్ల‌ను వేలం నిర్వ‌హించ‌గా కేవ‌లం 12 ప్లాట్లు మాత్ర‌మే అమ్ముడ‌య్యాయి. మ‌రి, ఒక్క‌సారిగా ఇలా ఆద‌ర‌ణ త‌గ్గ‌డానికి కార‌ణమేమిటి?

అమెరికా ఆర్థిక‌మాంద్యం ప్ర‌భావం క్ర‌మ‌క్ర‌మంగా క‌ళ్ల ముందే సాక్షాత్క‌రిస్తోంది. త‌మ ఉద్యోగాలుంటాయో.. ఊడ‌తాయేమోన‌ని విదేశాల్లో ప‌ని చేసే ఐటీ నిపుణుల్లో ఆందోళ‌న ఆరంభ‌మైంది. ఫ‌లితంగా, హైద‌రాబాద్‌లో నివ‌సించే ఐటీ ఉద్యోగులూ.. ప్లాట్లు, ఫ్లాట్ల‌లో పెట్టుబ‌డి పెట్టేందుకు ఒక‌టికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ప్లాట్ల‌ను కొన‌ట్లేదు. కొంద‌రేమో అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప రియ‌ల్ రంగంలో పెట్టుబ‌డుల్ని పెట్ట‌డం లేదు. మంచి హాట్ లొకేష‌న్లో.. మార్కెట్ రేటు కంటే మ‌రీ త‌క్కువకొస్తేనే కొంటున్నారు.

హైదరాబాద్‌లో నిబంధ‌న‌ల ప్ర‌కారం.. అభివృద్ధి చేసే లేఅవుట్ల‌కు గిరాకీ మెరుగ్గా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. హెచ్ఎండీఏ నిర్వ‌హించిన వేలం పాట‌ల్లో ప‌లికే ధ‌ర‌ను మిగ‌తా ప్లాట్ల‌కూ వ‌ర్తింపజేసే పోక‌డ పెరిగింది. ఇక్క‌డ ప్ర‌తిఒక్క‌రూ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఆయా ప్లాట్లు అమ్ముడ‌య్యాయే త‌ప్ప‌.. అదే రేటును మిగ‌తా వెంచ‌ర్ల‌కు వ‌ర్తింప‌జేయ‌డం క‌రెక్టు కాద‌ని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మ‌ధ్య‌వ‌ర్తులు చేస్తున్న గంద‌ర‌గోళం వ‌ల్ల హెచ్ఎండీఏ వేలం పాట‌లంటేనే ప్ర‌జ‌లు విముఖ‌త చూపించ‌డం ఆరంభ‌మైంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

This website uses cookies.